ట్యాక్సీ....ఒకప్పుడు మహానగరాల్లోని రోడ్లపై జనం ఈ పిలుపు వినేవారు. కానీ, జమానా మారింది. జనం మారారు. ట్రెండ్ మారింది. క్యాబ్ ల రాకతో స్మార్ట్ ఫోన్లలోనే సైలెంట్ గా ట్యాక్సీ బుక్ చేసేస్తున్నారు. అదే అదునుగా ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్లు ఇటు జనం...అటు డ్రైవర్ల జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఓలా, ఉబెర్ కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 'భారత్ ట్యాక్సీ' తో చౌక ధరలకే ప్రజలకు క్యాబ్ సేవలు అందుబాటులోకి తేనుంది. ఓలా, ఉబెర్ ల మాదిరి కాకుండా డ్రైవర్ల నుంచి ఎటువంటి కమీషన్లు వసూలు చేయకుండా ఈ సేవలు అందించనుండటం విశేషం.
బుక్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఓలా, ఉబర్ క్యాబ్ ఇంటి ముందు ప్రత్యక్షమవుతోంది. అంతవరకు బాగానే ఉంది. కానీ, పీక్ అవర్స్ లో మాత్రం కస్టమర్ల నుంచి ఈ రెండు సంస్థలు డబ్బు దండుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. అంతేకాకుండా, డ్రైవర్ల నుంచి ప్రతీ రైడ్‌పై 25 శాతం వరకు అధిక కమీషన్లు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఇటు డ్రైవర్లు, అటు ప్రయాణికులకు లాభం కలిగించేలా కేంద్రం భారత్ ట్యాక్సీ తీసుకురానుంది.
కేంద్ర సహకార శాఖ, జాతీయ ఈ-గవర్నెన్స్ విభాగం (NeGD) కలిసి 'భారత్ ట్యాక్సీ'ని తీసుకురాబోతున్నాయి.
రూ.300 కోట్ల మూలధనంతో 'సహకార్ ట్యాక్సీ కో-ఆపరేటివ్ లిమిటెడ్' అనే సంస్థను కూడా ఈ భారత్ ట్యాక్సీ కోసం ఏర్పాటు చేశారు. ఈ భారత్ ట్యాక్సీ నడిపే డ్రైవర్లు కమీషన్లకు బదులుగా రోజువారీ లేదా నెలవారీ సభ్యత్వ రుసుము చెల్లిస్తే చాలు. అంటే, ప్రయాణ చార్జీలు పూర్తిగా డ్రైవర్లకే దక్కుతాయి. భారత్ ట్యాక్సీని పైలట్ ప్రాజెక్ట్‌గా నవంబర్ నుంచి ఢిల్లీలో 650 క్యాబ్‌లతో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత డిసెంబర్‌లో ముంబై, పుణె, భోపాల్, జైపూర్ వంటి 20 నగరాలకు విస్తరిస్తారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో 'భారత్ ట్యాక్సీ'ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు.