రాయలసీమలోని ప్రొద్దుటూరు పట్టణం పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది దసరా వేడుకల వైభవం. ఈ పండుగలో పట్టణం మొత్తం వెలుగుల సముద్రంగా మారిపోతుంది. స్థానిక దేవాలయాలు, వీధులు, రథయాత్రలు, సంగీతం, నృత్యాలు.. అన్నీ కలగలిసి భక్తి-సాంస్కృతిక ఉత్సవంగా ఆ పట్టణాన్ని ముస్తాబు చేస్తాయి. ఈ వేడుకలను చూడటానికి చుట్టుపక్కల గ్రామాలనే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివస్తారు.
ఈ అద్భుతమైన సంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఆలోచనతో దర్శకుడు మురళీ కృష్ణ తుమ్మ ఒక ప్రత్యేక డాక్యుమెంటరీని తెరకెక్కించారు. అదే `ప్రొద్దుటూరు దసరా`. బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ‘బాల్కనీ ఒరిజినల్స్’ బ్యానర్‌పై ప్రేమ్ కుమార్ వలపల ఈ చిత్రాన్ని నిర్మించారు. సుమారు 40 నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీ ప్రొద్దుటూరు దసరా ఉత్సవాల ఆరంభం నుంచి ముగింపు వరకూ జరిగే ప్రతి అద్భుత ఘట్టాన్ని చూపిస్తుంది.

అక్టోబర్ 31న విడుదలైన ఈ డాక్యుమెంటరీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రొద్దుటూరు సాంస్కృతిక గౌరవాన్ని, భక్తి రసాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిందని విమర్శకులు, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సంగీతం, దృశ్యాల అద్భుత కలయికతో ఈ చిత్రాన్ని రూపొందించిన కొత్త టీమ్‌కు భారీ ఎత్తున ప్రశంసలు దక్కుతున్నాయి. ఇకపోతే ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం “ఈటీవీ విన్” లో నవంబర్ 7 నుండి ప్రొద్దుటూరు దసరా స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ ప్రాజెక్టుకు స్టార్ సర్కిల్స్ డిజిటల్ ప్రమోషన్స్ అందించగా, కిలారి సుబ్బారావు పీఆర్‌ఓగా వ్యవహరించారు. స్థానిక పండుగను జాతీయ స్థాయికి చేర్చిన ప్రొద్దుటూరు దసరా , రాయలసీమ సంస్కృతిని కొత్త తరానికి పరిచయం చేసే ప్రయత్నంగా నిలిచింది. కాగా, రాయలసీమ పండుగల ఆత్మను, ప్రొద్దుటూరి సంస్కృతిని దగ్గరగా అనుభవించేలా చేసిన ‘బాల్కనీ ఒరిజినల్స్’ బ్యానర్ నుంచి త్వరలో మరిన్ని సినిమాలు, డాక్యుమెంటరీలు రానున్నాయని సమాచారం.