ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 48 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు పార్టీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావును ఆయన ఆదేశించారు. తాజాగా శనివారం ఉదయం 12 గంటలకు మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయానికి వచ్చిన చంద్రబా బు.. పార్టీ నాయకులు, వారు చేస్తున్న పనులు, ఇటీవల వెలుగులో కి వచ్చిన వివాదాలు.. నాయకులకు మధ్య ఉన్న విభేదాలపై దృష్టి పెట్టారు.
కేవలం 15 రోజుల్లోనే చంద్రబాబు పార్టీ కార్యాలయానికి రావడం ఇది రెండోసారి. ఇటీవల ఒకసారి ఆయన లండన్ పర్యటనకు వెళ్లే ముందు.. పార్టీ కార్యాలయానికి వచ్చారు. అప్పట్లోనే సుదీర్ఘంగా పార్టీ నాయకుల శైలిని ఆయన విచారించారు. పార్టీ తరఫున పనిచేయాలని, వ్యక్తిగతంగా వివాదాలకు దూరంగా ఉండా లని కూడా తేల్చి చెప్పారు. పార్టీ సిద్ధాంతాలు తెలుసుకోవాలని.. తెలియపోతే.. సీనియర్లను అడిగి తెలుసుకో వాలని కూడా సూచించారు.
ఈ నేపథ్యంలో.. శనివారం మరోసారి పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు.. సుదీర్ఘంగా పార్టీ నాయకు ల వ్యవహారంపై చర్చించారు. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యక్రమాలను లైట్‌గా తీసుకుంటున్న నాయకుల పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీ నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన కార్యక్రమాల్లో కనీసం పాల్గొనని ఎమ్మెల్యేల జాబితాను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొత్తంగా 48 మంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంటున్నారని తెలుసుకున్నారు.
ఇక, మరో 20 మంది(ఆ 48 మందిలోని వారే) ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమానికి కూడా హాజరు కాలేదని తెలుసుకుని విస్మయం వ్యక్తం చేసిన చంద్రబాబు అలా ఎందుకు చేశారో వివరణ ఇవ్వాలని ఆదేశించా రు. ఈ క్రమంలో వారందరికీ నోటీసులు జారీ చేయాలని.. వారం లోగా వారి నుంచివివరణ తీసుకోవాలని పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. మరి సదరు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.