వైసీపీ కీలక నేతల్లో ఒకరుగా అంబటి రాంబాబు పేరు ముందుంటుంది. జగన్‌కి అత్యంత సన్నిహితుడు. రాజకీయంగా, మీడియా ఫ్రంట్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అంబటి, సాధారణంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలే చేస్తారు. విలేకరుల సమావేశం అంటే.. వైసీపీ పక్షాన అగ్గి రగిలించే వ్యాఖ్యలే వింటాం. కానీ ఈసారి మాత్రం సీన్ పూర్తిగా తారుమారైంది. కూటమి ప్రభుత్వాన్ని అంబటి స్వయంగా ప్రశంసించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల అంబటి రాంబాబు వందే భారత్ రైల్లో తిరుమలకు వెళ్లారు. శ్రీవారి దర్శనం తరువాత వెంగమాంబ అన్నవితరణ కేంద్రంలో భోజనం చేశారు. భోజనం చేసిన తరువాత ఆయన తన అనుభవాన్ని యూట్యూబ్ వీడియోలో పంచుకున్నారు. అందులో “అన్నప్రసాదం రుచిగా, శుచిగా ఉంది” అని కొనియాడారు. “నాణ్యమైన అన్నప్రసాదం అందిస్తున్న తీరు అద్భుతం. రోజుకు 90,000 మందికి భోజనం అందిస్తున్నారు. అయినప్పటికీ భోజనశాలను అత్యంత శుభ్రంగా నిర్వహించడం అనేది ఆశ్చర్యం కలిగిస్తోంది” అని అంబటి ప్రశంసించారు.

ఇలాంటి మాటలు సాధారణ భక్తులు చెబితే పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ వైసీపీ నేత అంబటి రాంబాబు చెబితే అది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నిజానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమలలో ఏర్పాట్లు, భోజనశాల నిర్వహణ, భక్తుల సేవా విధానంలో మార్పులు కనిపిస్తున్నాయంటూ భక్తులే చెబుతున్నారు. ఆ మాటల్ని అంబటి ఇప్పుడు పరోక్షంగా ధృవీకరించారు. ఇదే విషయం వైసీపీ వర్గాలకు పెద్ద షాక్. ఎందుకంటే ఇప్పటివరకు తిరుమల విషయంలో వైసీపీ తరఫున కేవలం విమర్శలే వినిపించాయి. కానీ, తొలిసారి అంబటి నుంచి కూటమి ప్రభుత్వానికి ప్రశంసతు దక్కడంతో వైసీపీ లో కలకలం రేపింది. వైసీపీ మీడియా అంబటి వీడియోను పూర్తిగా ఇగ్నోర్ చేసింది. టీడీపీ నేతలు, సానుభూతిపరులు మాత్రం సోషల్ మీడియాలో “వైసీపీ నేత నోటా కూటమి ప్రశంసలు!” అంటూ ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.