జూబ్లీహిల్స్ బై పోల్ ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వినూత్న ప్రచారానికి తెర తీసిన సంగతి తెలిసిందే. ఈవెంట్స్ నిర్వహించే సమయంలో ఏర్పాటు చేసిన మాదిరి పెద్ద ఎల్ ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి మరీ రోడ్ షోలను కేటీఆర్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారం పుష్ప సినిమాలో శ్రీ లీల ఐటమ్ సాంగ్ లా ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.
ఇక, ఇలా చేయడం వల్ల సమయం, డబ్బు వృథా అవుతున్నాయని, ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజలను డిస్టర్బ్ చేస్తున్నట్లే కదా అని కేటీఆర్ కు ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలోనే రేవంత్ కామెంట్లకు కౌంటర్ తో పాటు ఆ ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. ప్రత్యక్షంగా ప్రజలతో కనెక్ట్ అయ్యేందుకే ఈ తరహా ప్రచారం దేశంలో తొలిసారి తామే మొదలుబెట్టామని కేటీఆర్ క్లారిటీనిచ్చారు. కేవలం ఎన్నికల ప్రచారం సమయంలో మాత్రమే ఇలా చేస్తున్నామని, మిగతా సమయాల్లో డిస్టర్బ్ చేయడం లేదని క్లారిటీనిచ్చారు.
స్పీచ్ లు, ఊక దంపుడు ఉపన్యాసాలు కాకుండా...ప్రత్యర్థుల గురించి ప్రజలకు తెలియజేసేందుకు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుందని తాము భావించామని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కాలేదని, హైడ్రా వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు, రేవంత్, రాహుల్, భట్టి విక్రమార్క చెప్పిన మాటలు నిజం కాలేదని..ఈ విషయాలన్నీ ప్రజలకు వీడియోలు ప్లే చేసి వివరిస్తున్నామని అన్నారు. ఎన్టీఆర్ ను రేవంత్ ఎన్ని బూతులు తిట్టారు అని ప్రజలకు తెలియజేస్తున్నామని చురకలంటించారు.
ప్రజలతో నేరుగా కనెక్ట్ కావడం, వారిని ఎంగేజ్ చేయడం కోసం ఈ ఎల్ ఈడీ స్క్రీన్ల విధానం తాము మొదలుబెడితే కాంగ్రెస్ కాపీ కొట్టిందని ఎద్దేవా చేశారు. అయితే, వారికి కటౌట్ ఉంది కానీ కంటెంట్ లేదని సెటైర్లు వేశారు. పాలిటిక్స్ కూడా క్రికెట్ మాదిరి సైకాజికల్ గేమ్ అని, స్టేడియంలో క్రికెట్ ప్రత్యక్షంగా వీక్షించిన మాదిరిగా ఇంపాక్ట్ ఎక్కువ ఉండేలా ఈ స్క్రీన్స్ పెట్టామని చెప్పారు.
90 శాతం ప్రజలు ఒక పార్టీకి ఓటేయాలని ఫిక్స్ అవుతారని, మిగతా 10 శాతం మంది స్వింగ్ ఓటర్స్ కోసమే ఈ ప్రయాస అని తెలిపారు. ఈ రకంగా ఎల్ ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశామని, ఆ రకంగా ప్రజలందరికీ నేరుగా తాము చెప్పదలుచుకున్న విషయాన్ని ప్రభావవంతంగా వివరించగలుగుతున్నామని, కాంగ్రెస్ పార్టీని ఎండగడుతున్నామని అన్నారు.