వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త మాలపాటి విజయ్ భాస్కర్ రెడ్డి అరాచకాల చిట్టా భారీగా ఉన్నట్లుగా పెనమలూరు పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆయన సతీమణి భువనేశ్వరి.. మంత్రి లోకేశ్.. ఆయన సతీమణి బ్రాహ్మణితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తదితరులపై అసభ్యకర పోస్టులు పెట్టిన ఉదంతాల్లోనూ ఇతడి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అంతేకాదు.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ ఎన్వీ రమణ మీద తీవ్ర పదజాలంతో పోస్టులు పెట్టిన ఉదంతంలోనూ ఇతడి హస్తం ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
ఇప్పటివరకు పోలీసులు జరిపిన విచారణలో కొత్త అంశాల్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది. విజయ్ భాస్కర్ రెడ్డితో సహా పలువురు యూకే నంబర్లతో వాట్సప్ గ్రూప్స్ క్రియేట్ చేయటం.. వందలాదిగా సభ్యులుగా చేరి.. తీవ్ర పదజాలంతో అసభ్యకర పోస్టులు పెడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డితో లింకులు ఉన్న వారిపై పోలీసులు ఫోకస్ చేయగా.. తాడేపల్లిలోని వైసీపీ సోషల్ మీడియా సెల్ లోని శ్రీను.. రాజాతో పాటు.. కడపలోని వర్రా రవీంద్రరెడ్డి భాస్కర్ రెడ్డితో తరచూ ఫోన్లో సంప్రదింపులు చేసేవారని గుర్తించారు.
ఎలాంటి పోస్టులు పెట్టించేవారు.. అతను తయారు చేసిన అసభ్యకర కంటెంట్ ను స్థానికంగా ఉన్న వివిధ వాట్సప్ గ్రూపుల్లో పోస్టు చేసే వారని చెబుతున్నారు. అతడితో ఏయే నేతలకు సంబంధాలు ఉన్నాయన్న అంశంపై లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు జరిపిన విచారణలో అతను సుమారు 50కు పైగా పేజీల రిపోర్టును తయారు చేసినట్లుగా చెబుతున్నారు. ఏపీ ఎన్నికలకు ముందు నిందితుడి సోషల్ మీడియా పోస్టులు.. అతడికి ఉన్న వాట్సాప్ గ్రూపులు.. ఫేస్ బుక్ పేజీలు లాంటివి ఎన్ని ఉన్నాయన్నది ఆరా తీస్తున్నారు.
ఇటీవల అతగాడి నేర చరిత్రను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో వారు గుర్తించిన ఒక ఉదంతాన్ని పోలీసులు తమ విచారణలో ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. లండన్ లోని టౌన్ టన్ ప్రాంతంలో విజయ్ భాస్కర్ రెడ్డి.. ‘‘రెడ్డీస్ న్యూస్’’ పేరుతో నిర్వహించే షాపులో మైనర్లకు ఈ సిగిరెట్లుఅమ్మినట్లుగా తేలటంతో అతడి మీద పోలీసులు కేసు నమోదు చేశారని.. కోర్టు విచారణలో తన నేరాన్ని అంగీకరించిన నేపథ్యంలో అడికి అక్కడి కోర్టు గత ఏడాది భారీ జరిమానా విధించినట్లుగా గుర్తించారు. ఇండియన్ కరెన్సీలో ఈ ఫైన్ మొత్తం రూ.2.77 లక్షలుగా తేల్చారు. ఈ క్రమంలో అతడికి సంబంధించిన అంశాలపై మరింత లోతుగా పెనమలూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు.