2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపులో తద్వారా కూటమి గెలుపులో ఎన్నారైల పాత్ర కీలకమన్నది అందరికీ తెలిసిందే. ఎన్నారైలంతా కలిసికట్టుగా, ఐకమ్యంగా ఉంటూ కూటమిని గెలిపించేందుకు తమ వంతు పాత్ర పోషించారు. అయితే, రాబోయే ఎన్నికల నాటికి ఈ పరిస్థితి ఉండేలా కనిపించడం లేదు. బంగారు బాలయ్య - బసవతారకం ఈవెంట్ పేరుతో అశ్విన్ అట్లూరి రాజేసిన నిప్పురవ్వ ఎన్నారై టీడీపీలో కార్చిచ్చుగా మారింది. అశ్విన్ పుణ్యమా అంటూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లోని ఎన్నారై టీడీపీ గ్రూపులు రెండు వర్గాలుగా చీలాయి.
ఇటీవల ఆస్ట్రేలియాలో లోకేష్ పర్యటన సందర్భంగా ఈ వర్గపోరు రచ్చకెక్కింది. మెల్బోర్న్ లో లోకేష్ ముందే ఇరు వర్గాలకు చెందిన ఎన్నారైలు బాహాబాహీకి దిగారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. న్యూజిలాండ్ లోని ఎన్నారై టీడీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేసే దాకా ఇష్యూను లాగారు. ఓ వైపు ఎన్నారై వైసీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా కలిసికట్టుగానే ఉంటున్నారు. కానీ, తెలుగు తమ్ముళ్లు, చెల్లెళ్లకు ఏమైందో అర్థం కావడం లేదు. ఈ ఆరాటం..పోరాటం..పదవుల కోసమో..పెత్తనం కోసమో తెలియడం లేదు.
ఎన్నారై టీడీపీ నేతలలో చాలామందికి ఉన్న గుర్తింపు పరిమితం అనే చెప్పవచ్చు. బాలకృష్ణ సినిమాల డిస్ట్రిబ్యూషన్, టీటీడీలో దర్శనం టికెట్స్ ఎట్సెట్రా పనులకు వారి గుర్తింపు పనికి వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఏపీలో కుల, ప్రాంతీయ వర్గాల్లో కొద్దో గొప్పో పేరు తప్ప వీళ్లకు పెద్ద బెనిఫిట్ ఏమీ ఉండదు. ఎన్నారై టీడీపీ కోసం ఏళ్లుగా నిబద్ధత పనిచేస్తున్న కొందరు సీనియర్లు, కొందరు యువ నేతలు మాత్రం పార్టీలో తగిన గుర్తింపు, నామినేటెడ్ పదవులు పొందారు. ఇవన్నీ అర్థం చేసుకొన్న సీనియర్ ఎన్నారైలు ఈ గ్రూపులకు దూరంగా ఉంటున్నారు.
ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఎన్నారై టీడీపీ వల్ల పార్టీకి నష్టం ఎక్కువ..లాభం తక్కువ అన్నట్లు ఉంది. 2024 సంగతి పక్కనబెడితే ఈ గ్రూపు రాజకీయాల వల్ల 2029 ఎన్నికల ఓటింగ్ సమయానికి ఇండియా వచ్చి ఓటు వేసే వారు ఎంతమంది అన్నది తెలుసుకొని పార్టీ పెద్దలు అవాక్కయ్యారట. కానీ, రోజుకో దేశానికి సంబంధించిన ఎన్నారై నేతల పంచాయతీ ప్రతి పూటీ తీర్చలేక ఎన్నారై టీడీపీ గ్రూపులంటేనే పార్టీ పెద్దలకు విసుగొచ్చిందట.
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు విదేశీ పెట్టుబడుల కోసం విదేశాలలో పర్యటిస్తుంటే...వారికి సహకరించాల్సింది పోయి..ఆలి వర్గపోరు తీర్చాలని కోరడం ఎంతవరకు సమంజసం? ఈ వర్గపోరు వల్ల పార్టీకి, తద్వారా రాష్ట్రానికి నష్టం చేకూరుస్తున్న కొందరు ఎన్నారైలు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవలని పార్టీ శ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధి కోరే ఎన్నారై టీడీపీ నేతలు, అభిమానులు కోరుతున్నారు.
న్యూజిలాండ్ లోని ఎన్నారైల టీడీపీ నేతలలో కొందరు తాము చెప్పిందే జరగాలి లేదంటే వేరే గ్రూపు పెట్టుకుంటాం అన్నరీతిలో వ్యవహరిస్తున్నారని న్యూజిలాండ్ టీడీపీ జనరల్ సెక్రటరీ ప్రవీణ అన్నారు. తమ మాట చెల్లుబాటు కావడం లేదన్న కారణంతోనే వారు గ్రూపు తగాదాలకు తెర తీశారని చెప్పారు. అయితే, ఎన్నో ఏళ్లుగా తాము న్యూజిలాండ్ ఎన్నారై టీడీపీ తరఫున ఎన్టీఆర్ జయంతితోపాటు పలు కార్యక్రమాలు ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ దగ్గర లెటర్ హెడ్స్, డాక్యుమెంట్స్, వాట్సాప్ స్క్రీన్ షాట్లు వంటివి ఉన్నాయని, ఎవరైనా చెక్ చేసుకోవచ్చని...ప్రజలు వాస్తవాలు గ్రహించాలని అన్నారు. ఈ వర్గపోరు గురించి టీడీపీ కేంద్ర కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు.