బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (89) ఈ రోజు ఉదయం కన్నుమూశారని జాతీయ మీడియా మొదలు సోషల్ మీడియా వరకు అంతటా ప్రచారం జరిగింది. కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధులతో ముంబైలోని బీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధర్మేంద్ర చనిపోయారని చాలామంది నమ్మారు కూడా. ధర్మేంద్ర మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ పలువురు బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు పారిశ్రామికవేత్తలు సంతాపం ట్వీట్లు కూడా చేశారు. అయితే, తన తండ్రి చనిపోలేదని ధర్మేంద్ర కూతురు, బాలీవుడ్ నటి ఇషా డియోల్ స్పష్టతనిచ్చారు.
ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, కోలుకుంటున్నారని ఇషా చెప్పారు. మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. మీడియా అనవసరమైన ఆత్రుతతో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని అన్నారు.. దయచేసి తమ కుటుంబానికి కొంత ప్రైవసీ ఇవ్వాలని కోరారు. ధర్మేంద్ర త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
ధరమ్ జీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న అందరికీ ధన్యవాదాలు చెప్పారు హేమా మాలిని. ఆయన వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారని, తామంతా ఆయనతోనే ఉన్నామని తెలిపారు. షారుఖ్ ఖాన్, ఆర్యన్ ఖాన్, సల్మాన్ ఖాన్, గోవిందా, అమీషా పటేల్ తదితర బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆసుపత్రికి వెళ్లి ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.