వైసీపీ అధినేత, మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్‌పై ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ అసెంబ్లీకి రాకుండా ఇంట్లో మీడియాతో మాట్లాడుతున్నారని.. ఆయనను ప్రజలు గెలిపించింది. ఇంట్లో కూర్చుని మాట్లాడమని కాదన్నారు. జగన్ అసెంబ్లీకి రావాలని తానుకోరుకుంటున్నట్టు తెలిపారు. అయితే.. జగన్ సభకు వస్తే.. తనను `అధ్యక్ష` అని సంబోధించాల్సి ఉంటుందని.. అలా పిలవడం ఇష్టం లేదు కాబట్టే జగన్ అసెంబ్లీకి రావడం లేదన్నారు. ఆయన అసెంబ్లీకి రావాలనే తాము కోరుకుంటున్నట్టు చెప్పారు.
ఇక, జగన్ గత కొన్నాళ్లుగా కోరుతున్న డిమాండ్‌పైనా అయ్యన్న పాత్రుడు స్పందించారు. తాను అసెంబ్లీకి వెళ్తే.. సీఎం మాట్లా డేందుకు ఎంత సమయం ఇచ్చారో.. తనకు కూడా అంతే సమయం ఇవ్వాలన్న జగన్ డిమాండ్‌ను అయ్యన్న కొట్టి పారేశారు. ``జగన్ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే. ఒక సాధారణ ఎమ్మెల్యేకు ఎంత సమయం ఇస్తామో.. ఆయనకు కూడా అంతే సమయం ఇస్తాం. దీనిలో మరో మాటేలేదు.`` అని తేల్చి చెప్పారు. వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఒక్క జగన్ మినహా మిగిలిన 10 మంది జీతాలు తీసుకుంటున్నారన్న ఆయన.. వారి విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
ఇక, జగన్ పాలనపై అయ్యన్న నిప్పులు చెరిగారు. జగన్‌కు అధికారం తెలుసుకానీ.. పాలన చేతకాదన్నారు. అందుకే రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని వ్యాఖ్యానించారు. ``కొంత మంది దుర్మార్గులు.. రాజకీయాలంటే పైలాపచ్చీసు అనుకునేవారు.. అధికారం లోకి వచ్చారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టారు. అందుకే ప్రజలు సుపరిపాలన కోసం కూటమిని గెలిపించారు`` అని తెలిపారు. వైసీపీ చేసిన విధ్వంసాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం సరిచేస్తోందని.. అనేక మంచి కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. అయినా.. అన్ని మంచి పనులను వక్రీకరిస్తూ.. వైసీపీ నాయకులు పబ్బం గడుపుకొంటున్నారని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.