తెలంగాణ ప్రభుత్వానికి అప్పు పుట్టే పరిస్థితి లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆదాయం తక్కువ..ఖర్చు ఎక్కువ ఉందని, నన్ను కోసినా రూపాయి ఎక్కువ ఆదాయం రాదని రేవంత్ అనడంతో రాజకీయ దుమారం రేగింది. ఈ క్రమంలోనే రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. రేవంత్ దిక్కుమాలిన పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైందని, ఇకపై, కేసీఆర్ ను వ్యక్తిగతంగా రేవంత్ దూషిస్తే నాలుక చీరేస్తామంటూ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు.
కేసీఆర్‌ను ఇప్పటి వరకు ఎన్ని మాటలన్నా పడ్డామని, ఇకపై ఊరుకోబోమని, ఇదే లాస్ట్ వార్నింగ్ అని మండిపడ్డారు. రేవంత్ పాలనతో గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిన పెట్టే నాయకుడు కేసీఆర్ మాత్రమేనని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డికి పాలన చేతకాకుంటే అడ్డమైన హామీలు ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఢిల్లీ పార్టీలను నమ్మవద్దని ప్రజలకు కేసీఆర్ చేసిన హెచ్చరికలు నేడు అక్షర సత్యాలుగా నిలుస్తున్నాయని అన్నారు. రేవంత్ రెడ్డి కాడి కిందపడేశారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి అత్యంత అసమర్థ, దక్షత లేని సీఎం అని ఆయన తాజా వ్యాఖ్యలతో స్పష్టమైందని కేటీఆర్ అన్నారు.