ఏపీ సీఎం చంద్రబాబు కోసం తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఏపీకి వచ్చారు. తాడేపల్లిలోని ఉండవల్లిలో ఉన్న ముఖ్య మంత్రి నివాసానికి వచ్చిన ఆయన.. ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణలోని ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు రావాలని ఆయనను ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వానపత్రికను సీఎం చంద్రబాబుకు అందించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల అభివృద్ధి అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. అమరావతి గురించి మంత్రి కోమటిరెడ్డి అడిగారు.
అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ-తెలంగాణలు.. రాష్ట్రాలుగా విడిపోయినా.. అభివృద్ధిలో కలిసి ముందుకు సాగాలని కోరుకుంటున్నామన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. చంద్రబాబు విజన్ 2020 కారణంగానే హైదరాబాద్ డెవలప్ అయిందని తెలిపారు. అమరావతి కూడా సీఎం చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలని.. స్నేహ పూర్వక సంబంధాలు కూడా కొనసాగాలని కోరుకుంటున్నట్టు మంత్రి కోమటిరెడ్డి చెప్పారు.
ఇక, ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తాను చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన కోమటిరెడ్డి.. ఆనాటి పరిస్థితులు అలా ఉన్నాయని, అందుకే అలా వ్యాఖ్యానించానని చెప్పారు. ``అప్పట్లో మా రాష్ట్రంలోఅలాంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే అలా మాట్లాడా. ఇప్పుడు చంద్రబాబును ఆహ్వానించేందుకు వచ్చా.`` అని అన్నారు. కాగా.. కోనసీమ కొబ్బరి రైతులను పరామర్శిం చేందుకు వెళ్లిన పవన్ కల్యాణ్.. రాష్ట్ర విభజనకు కోనసీమ పచ్చదనం కూడా కారణమేనని చెప్పారు. కొబ్బరి తోటలకు దిష్టి తగిలిందన్నారు. ఈ వ్యాఖ్యలు.. దుమారం రేపిన నేపథ్యంలో కోమటి రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.