టిడిపిలో గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న కీలకమైన వాదనకు మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒకరకంగా చెక్ పెట్టేశారు. నాయకులు ఎంత బలంగా ఉన్నప్పటికీ.. వారు ప్రాధాన్యం కాదని పార్టీ సిద్ధాంతాలు, ప్రజలు తమకు ముఖ్యమని ఆయన చెప్పుకొచ్చారు. తద్వారా రాష్ట్రంలోని కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో తమదే రాజ్యం అని, తమదే ఆధిపత్యం అని భావిస్తున్న కొంతమంది నాయకులకు ఆయన పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్టే నని నాయకులు చెబుతున్నారు.
వాస్తవానికి ఏ పార్టీలో అయినా పార్టీ జెండా ఆ జెండా సిద్ధాంతాలు పార్టీ అధినేత వంటి అంశాలు కీలకంగా ఉంటాయి. టీడీపీలో అయితే సైతాంతికంగా కూడా మరో అడుగు ముందుకు వేసి పార్టీ నాయకులు అటు పార్టీకి ఇటు అధినేతకు మధ్య సంధాన కర్తలుగా ప్రజలకు మేలు చేసే విధంగా వ్యవహరించాలి అనేది ఆది నుంచి వస్తున్న అంశం. కానీ, ఇటీవల కాలంలో చాలా మంది నాయకులు తమ కష్టం మీద నెగ్గామని తమదే విజయమని చెప్పుకుంటూ వస్తున్నారు.
అయితే వీరిని బహిరంగంగా విమర్శించకుండా బహిరంగంగా వారి పేర్లు బయట పెట్టకుండా పార్టీ లైన్ ఏమిటో నారా లోకేష్ తాజాగా వెల్లడించడం గమనార్హం. దీనిని బట్టి పార్టీ నాయకులు ఏ విధంగా వ్యవహరించాలి అనేది నారా లోకేష్ స్పష్టం చేశారు. అంతేకాదు.. కూటమి ప్రాధాన్యాన్ని కూడా ఆయన చెప్పారు. తద్వారా పార్టీ నాయకులకు చెప్పకనే ఆయన పలు విషయాలు చెప్పుకొచ్చినట్టు అయింది. ఏదేమైనా పార్టీలో నాయకులు ముఖ్యమైనప్పటికీ వారిని బట్టి పార్టీ నడవదు అనేది తేల్చారు.
ఇది గత ఎన్నికల్లో కూడా రుజువైంది. వైసిపి బలమైన నాయకులంటూ కొంతమందిని, బలహీన వర్గాలనుంచి కొంతమందిని ఎంపిక చేసి గత ఎన్నికల్లో పోటీకి పెట్టింది. అయినప్పటికీ 11 స్థానాలకే పరిమితమైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజలు పార్టీ సిద్ధాంతాలను పట్టుకుని నాయకులు ముందుకు సాగితే ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికల్లో విజయం దక్కించుకుంటారు లేకపోతే వారే తమ పరిస్థితిని దిగజార్చుకునే స్థితి ఏర్పడుతుంది.