వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయ సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, అవసరమైతే...రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానని ఆయన ఇటీవల కొన్ని కామెంట్లు చేశారు. ఇక, తాజాగా ఆయన సనాతన ధర్మ పరిరక్షడిగా కొత్త అవతారమెత్తినట్లు కనిపిస్తోంది. ఆ క్రమంలోనే తాజాగా ఆయన హిందూ మతంపై, మత మార్పిళ్లపై చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. హిందూ మతంపై కుట్రలు జరుగుతున్నాయని, వాటిని సహించేది లేదని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో కొత్త చర్చకు తెర తీశాయి.
డబ్బు ఆశ చూపించి మతమార్పిడులకు పాల్పడే వారికి తగిన గుణపాఠం చెప్పాలని కూడా ఆయన పిలుపునివ్వడం ఆసక్తికరంగా మారింది. ఇక, రెండు దశాబ్దాలుగా జరిగిన మతమార్పిడులపై కూటమి ప్రభుత్వం ఓ కమిటీ వేసి సమగ్ర విచారణ జరపాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ప్రలోభాలకు గురిచేసి మతాలను మార్చే ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన అవసరముందన్నారు. దేశం కోసం, ధర్మం కోసం హిందూ సమాజంలోని అన్ని వర్గాలు ఏకం కావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ ఐక్యతే భారతదేశానికి అసలైన రక్ష అని, అదే శ్రీరామరక్ష అని అన్నారు.