తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న ఐడీపీఎల్ భూ ముల వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. సుమారు 4 వేల కోట్ల రూపాయల విలువైన ఈ భూముల వ్యవహారం ఇటీవల తీవ్ర రాజకీయ రచ్చకు దారి తీసింది. ఈ భూములను బీఆర్ ఎస్ పార్టీకి చెందిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కబ్జా చేశారంటూ.. తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత ఆరోపించారు. మీడియా ముందు తీవ్ర విమర్శలు గుప్పించారు.
అయితే.. ఇదేసమయంలో స్పందించిన మాధవరం.. కూడా కవితపై నిప్పులు చెరిగారు. బీఆర్ ఎస్ పార్టీ ద్రోహి అంటూ.. విమర్శలు గుప్పించారు. ఎవరు భూములు దోచుకున్నారో.. అధికారాన్ని అడ్డు పెట్టుకుని భూములు ఎలా కొట్టేశారో.. చర్చకు రా! అంటూ.. మాధవరం సవాల్ రువ్వారు. ఈ పరిణామాలు ఇరు పక్షాల మధ్య రాజకీయ రచ్చను కొనసాగిస్తున్నాయి. అయితే.. తాజాగా ప్రభుత్వం ఈ భూములపైనే విచారణకు ఆదేశించింది.
ఆ భూములు ఎవరివి? ఎప్పుడు విక్రయించారు? ఎవరు కొన్నారు? ఇలా.. అనే విషయాలపై విచారణ చేయాలని ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్‌మెంటును ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి అధికారులు కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలావుంటే..ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం తెరమీదికి వచ్చింది. కవిత ఆరోపణలకు అనుగుణంగా.. ప్రభుత్వం విచారణకు ఆదేశించిందంటూ.. జాగృతి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. కవిత చెప్పింది కాబట్టే ఇప్పుడు విచారణ జరుగుతోందన్నారు.
దీంతో కవిత ఇమేజ్ పెరుగుతోందని కూడా ఒకరిద్దరు చెప్పడం గమనార్హం. అయితే.. మాధవరం వెంటనే ఎంట్రీ ఇచ్చారు. అలాంటి దేమీ లేదని.. తానే స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాశానని.. తనపైనా.. తన భూములపైనా వస్తున్న విమర్శలపై విచారణ చేయించాలని కోరానన్నారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను కూడా ప్రభుత్వానికి సమర్పించినట్టు మాధవరం స్పష్టం చేశారు. మొత్తానికి కవిత చెప్పారనో.. లేక.. మాధవరం కోరారనో.. తెలియదు కానీ.. ప్రభుత్వం ఈ భూములపై విచారణకు దిగడం చర్చగా మారింది.