కేంద్ర ఎన్నికల సంఘం తీసుకువచ్చిన ప్రత్యేక సమగ్ర రివిజన్(ఎస్ ఐఆర్) ప్రక్రియ వ్యవహారంపై కాంగ్రె స్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమించేందుకు రెడీ అయింది. అయితే.. ఓట్ చోరీ ద్వారా కేంద్రంలో మోడీ గద్దె నెక్కుతు న్నారని చెబుతున్న హస్తం నాయకత్వానికి మద్దతు కొరవడుతోంది. ఈ వ్యవహారం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సొంతదని వ్యాఖ్యానిస్తూ.. అదే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఉన్న పలు పార్టీలు గళం వినిపిస్తున్నాయి. అంతేకాదు.. `ఓట్ చోరీ జరిగి ఉంటే.. మేం ఎలా గెలిచామంటూ`.. ఇదే కూటమి ఎంపీలు ప్రశ్నిస్తున్నారు.
రెండు రోజుల కిందట ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ క్రమంలో ఓటు దొంగ-గద్దె దిగు నినాదంతో ప్రధాని మోడీపై నిప్పులు చెరిగింది. ఈ క్రమం లోనే దేశవ్యాప్తంగా ఓట్ చోరీ యాత్రకు కూడా రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఇది జరిగిన తర్వాత.. పార్లమెంటులో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎంపీల మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకుంది. మీదే ఓట్ చోరీ అంటూ.. బీజేపీ ఎదురు దాడి చేసింది. మరోవైపు ఎన్నికల సంఘం కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకుంది.
ఇదిలావుంటే.. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి.. ఇండియా కూటమిలో కీలక నాయకుడు ఒమర్ అబ్దుల్లా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి వెంటిలేటర్‌పై ఉందన్న ఆయన.. ఓట్ చోరీ అంశంతో తమకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. ఇదే జరిగిందని భావిస్తే.. జమ్ములో కూడా బీజేపీ ప్రభుత్వమే వచ్చి ఉండాలి కదా!. అని వ్యాఖ్యానించారు. సో.. కాంగ్రెస్ పార్టీ లేని విషయాన్ని ఉన్నదిగా చెబుతోందని కూడా అనేశారు.
ఇక, తాజాగా ఇండియా కూటమిలో బలమైన పార్టీగా ఉన్న మహారాష్ట్రకు చెందిన విపక్షం నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్ సీపీ) ఎంపీ.. ఫైర్ బ్రాండ్ నాయకురాలు సుప్రియా సూలే కూడా.. తీవ్రంగా స్పందించారు. తాను గత నాలుగు సార్లుగా వరుసగా ఎంపీగా విజయం దక్కించుకుంటానని చెప్పారు. ఓట్ చోరీ వ్యాఖ్యలు నిజమైతే.. తాను ఓడిపోయి ఉండాలి కదా! అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వేరే ప్రజా ప్రయోజన నిరసనలు చేపడితే తాము మద్దతు ఇస్తామని.. ఈ విషయంలో పార్టీకి మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పడం గమనార్హం. మరి కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.