వైసీపీలో మ‌రో బిగ్ వికెట్ డౌన్‌.. ఆ మ‌హిళా మాజీ మంత్రి దారెటు?

admin
Published by Admin — December 17, 2025 in Politics, Andhra
News Image

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత వరుస షాక్‌లను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు పార్టీకి బలంగా నిలిచిన నేతలే ఇప్పుడు ఒక్కొక్కరుగా దూరమవుతుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఆ జాబితాలోకి మరో కీలక మహిళా నేత పేరు బలంగా వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు… మాజీ మంత్రి విడదల రజిని.

పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో ఉన్న పలువురు సీనియర్ నేతలు ఇప్పటికే పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆ క్రమంలో ఇప్పుడు విడదల రజిని కూడా తాడేపల్లి వైపు రావడం మానేశారన్న సమాచారం చర్చనీయాంశంగా మారింది. గత కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాల్లో ఆమె కనిపించకపోవడం, అధిష్ఠానంతో దూరం పెరిగిందన్న సంకేతాల్ని ఇస్తోందనే వాదన వినిపిస్తోంది.

విడదల రజిని రాజకీయ ప్రస్థానం ఆసక్తికరమైనది. ఒకప్పుడు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అనుచరురాలిగా, ద్వితీయ శ్రేణి నాయకురాలిగా ఉన్న రజినిని నేరుగా పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇచ్చిన ఘనత జగన్‌కే దక్కుతుంది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగగానే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అదే సమయంలో రజినికి మంత్రి పదవి కూడా దక్కింది. అయితే ఆమెపై స్థానిక వ్యతిరేకత ఉందన్న కారణంతో 2024 ఎన్నిక‌ల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపించి టికెట్ కేటాయించారు. అన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కూట‌మి వేవ్‌లో ర‌జిని కొట్టుకోపోయారు.ఆ తర్వాత నుంచే ఆమె రాజకీయ వ్యవహారాల్లో కొంత సైలెంట్ అయ్యారని ప్రచారం మొదలైంది. 

ముఖ్యంగా తాడేపల్లి వెళ్లడం మానేయడం పార్టీ వర్గాల్లో అనుమానాలకు తావిచ్చింది. ఆమె రాజకీయ ప్రయాణంలో కీలక మలుపు దగ్గర్లోనే ఉందన్న అభిప్రాయం బలపడుతోంది. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న.. విడదల రజిని దారెటు? అన్నదే. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న కథనం ప్రకారం ఆమె జనసేన పార్టీలో చేరే అవకాశాలు బలంగా ఉన్నాయి. నిజానికి మిగ‌తా వైసీపీ నేత‌లు మాదిరిగా ర‌జినీ అడ్డగోలుగా మాట్లాడలేదు. అందుకే రజనీ విషయంలో సాఫ్ట్ కార్నర్ ఉంది. ఈ నేప‌థ్యంలో జనసేన నుంచి సానుకూలత వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. పైగా అక్కడ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. బాలినేనితో రజినికి సన్నిహిత సంబంధాలు ఉండ‌టంతో జనసేనలో ఆమె చేరికకు అనుకూలంగా మారుతుందన్న అంచనా వ్యక్తమవుతోంది. అదే జ‌రిగితే వైసీపీలో మ‌రో బిగ్ వికెట్ డౌన్ అయిన‌ట్లే అవుతుంది.

Tags
Vidadala Rajini YSRCP Ap Politics YS Jagan Janasena TDP Andhra Pradesh
Recent Comments
Leave a Comment

Related News