శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు నెలకు 4500 రూపాయలు...అంటే రోజుకు 150 రూపాయలు...ఈ రోజుల్లో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి..ఆ స్టైఫెండ్ వారికి సరిపోవడం లేదు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టిలో పడింది. ఇంకేముంది ఆ స్టైఫెండ్ ను రూ.12,500కు పెంచుతూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. కానిస్టేబుళ్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా కానిస్టేబుళ్లకు చంద్రబాబు తీపి కబురు చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనితతో కలిసి కానిస్టేబుళ్లుగా ఎంపికైన 5,757 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను చంద్రబాబు అందజేశారు.
వైసీపీ అసమర్థ పాలనతో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందని, రాష్ట్రాన్ని పునర్నిర్మించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. గత ప్రభుత్వం కేవలం మొక్కుబడిగా నోటిఫికేషన్ ఇచ్చిందని, తాము రికార్డు సమయంలో కేవలం 60 రోజుల్లోనే పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించామని చంద్రబాబు తెలిపారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఎంపికలు పూర్తి చేశామన్నారు.
ఈ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియను అడ్డుకునేందుకు కోర్టులో కేసులు వేశారని, వాటిని అధిగమించి ఈ నియామక ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. మొత్తం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, 6,014 మంది ఎంపికయ్యారని, వారిలో 5,757 మంది శిక్షణకు హాజరయ్యారని వివరించారు. స్టైఫెండ్ పెంచినందుకు సీఎం చంద్రబాబుకు ట్రైనీ కానిస్టేబుళ్లు ధన్యవాదాలు తెలిపారు. ఇటువంటి నిర్ణయాలు కేవలం చంద్రబాబుకే సాధ్యమిని కొనియాడుతున్నారు.