రాష్ట్రంలో ఇక నుంచి `స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్` ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహా విధానాన్నే పరిపాలనలోనూ తెస్తున్న ట్టు సీఎం ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో వివిధ అంశాల పై కలెక్టర్లకు ఆయన పలు సూచనలు, దిశా నిర్దేశాలు చేశారు. త్వరితగతిన ఫిర్యాదుల పరిష్కారంతో పాటు.. జిల్లా కలెక్టర్లు, అధికారుల పనితీరును `స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సే` కొలమానంగా తీసుకుంటామన్నారు.
ముఖ్యంగా ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల ప్రజల్లోనూ సానుకూలత, సంతృప్తి పెరిగేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనన్నారు. ఇళ్లు లేని పేదలు, రైతులు, మహిళలు, పిల్లలు, యువత ఇలా అన్ని వర్గాలకు మంచి చేయడం ద్వారా ప్రజల్లో సానుకూలత పెంచాలన్నారు. గత రెండు రెండు మాసాల్లో ప్రజల సంతృప్తస్థాయిలను ఆయన వివరించారు. ప్రభుత్వ పాలనకు జిల్లా కలెక్టర్లే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటారని, ఈ విషయాన్ని ప్రతి అంశంలోనూ గమనంలో పెట్టుకోవాలని అన్నారు.
ఇదేసమయంలో రాజకీయ నేతలకు, ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం కూడా కలెక్టర్లపై ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు. కొన్ని అంశాల్లో ప్రజా ప్రతినిధుల సూచనలు అమలయ్యేలా చూడాలన్నిరు. అదేవిధంగా కలెక్టర్లు కూడా ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాలని.. వారి సేవలను కూడా వినియోగించుకోవాలని తేల్చి చెప్పారు. వివిధ జిల్లాల్లో అనుసరించే బెస్ట్ ప్రాక్టీసెస్(మంచి పనులు) ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజల నుంచి వచ్చిన గ్రీవెన్సులను కూడా వేగంగా పరిష్కరించి పారదర్శకంగా ఆన్ లైన్‌లో ఉంచాలని సీఎం చంద్రబాబు సూచించారు. లిటిగేషన్లపై ప్రజల్లో చైతన్యం పెంచి వాటిని పరిష్కరించుకునేలా అవగాహన పెంచాలని పేర్కొన్నారు. చేసిన అభివృద్ధి పనుల్ని ప్రజలకు తెలియచేసేలా సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం చేయాలని సూచించారు. 15 శాతం వృద్ధి రేటు సాధనలో భాగస్వాములు కావాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. కాగా.. చంద్రబాబు వ్యూహం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.