టాలీవుడ్‌లో ‘కింగ్’ అనగానే గుర్తొచ్చే పేరు అక్కినేని నాగార్జున. 66 ఏళ్ల వయసులోనూ యూత్ హీరోల్ని మించిన ఫిట్‌నెస్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఆయన వెనుక ఇంతటి కష్టం దాగి ఉందని తాజాగా వెలుగులోకి వచ్చింది. గత 15 ఏళ్లుగా తాను ఓ తీవ్రమైన మోకాలి సమస్యతో పోరాడుతున్నానని నాగార్జున స్వయంగా వెల్లడించడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగార్జున, మీడియాతో మాట్లాడుతూ తన ఆరోగ్య ప్రయాణం గురించి ఓపెన్‌గా మాట్లాడారు. “సుమారు 15 ఏళ్ల క్రితం నాకు మోకాలి నొప్పి మొదలైంది. ఆ నొప్పి ఇప్పటికీ ఉంది. అయినా కూడా మోకాలి రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకోలేదు. వీలైనంత వరకు దాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాను” అంటూ తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పారు.
అయితే మోకాలి నొప్పి తగ్గించేందుకు ల్యూబ్రికెంట్ ఫ్లూయిడ్స్, పీఆర్‌పీ వంటి ఆధునిక చికిత్సలను తీసుకున్నట్లు ఆయన తెలిపారు. డాక్టర్ల మార్గదర్శకత్వంలో మోకాలి లోపల కణజాలం పునరుత్పత్తి అయ్యేలా చూసుకున్నానని, అందుకోసం చాలా ఓపిక అవసరమైందని చెప్పారు. “నొప్పి ఉన్నా లేకపోయినా డైలీ మార్నింగ్ మోకాలి కోసం ప్రత్యేకంగా రిహాబ్ చేసేవాడిని. చాలామందికి ఫిట్‌గా కనిపించడం ఈజీగా అనిపిస్తుంది. కానీ దాని వెనుక చాలా కష్టం, డిసిప్లిన్ ఉంటుంది” అంటూ నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాయి.
ఇకపోతే ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, అయితే అవసరమైతే తప్ప సర్జరీ వైపు వెళ్లే ఆలోచన లేదని ఆయన తేల్చిచెప్పారు. నాగార్జున వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారడంతో వయసు కాదు.. విల్ పవర్ ముఖ్యమని నాగ్ నిరూపించారంటూ అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, నాగార్జున ఈ ఏడాది `కూలీ`, `కుబేరా` చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఆయన తన కెరీర్ లో మైలురాయిలాంటి వందో చిత్రంతో బిజీగా ఉన్నారు. తమిళ దర్శకుడు రా. కార్తీక్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా.. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది.