గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీకి మరోసారి లీగల్ షాక్ తగిలింది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్‌లో వంశీపై తాజాగా క్రిమినల్ కేసు నమోదవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఇప్పటికే వరుస కేసులతో సతమతమవుతున్న వంశీపై ఇప్పుడు మరో దాడి ఆరోపణలు రావడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులు గత ఏడాది జులై నెలలో తనపై దాడి చేశారని సునీల్ అనే వ్యక్తి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మాచవరం పోలీసులు వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ, ఆయనతో పాటు మరో ఎనిమిది మంది అనుచరులపై కేసు నమోదు చేశారు. అదే సమయంలో ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేశారు. దాడి జరిగిన పరిస్థితులు, సాక్ష్యాలు, సీసీటీవీ ఫుటేజ్ వంటి అంశాలను సేకరించే పనిలో పోలీసులు బిజీ బిజీగా ఉన్నారు.
అయితే ఇప్పటికే నమోదైన కేసుల నేపథ్యంలో ఈ కొత్త ఫిర్యాదు వంశీకి మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఓ టీడీపీ కార్యకర్త కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్ట్ అయిన వంశీ, ఆ తర్వాత వరుసగా కేసుల్లో ఇరుక్కొన్నారు. మొత్తం 11 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన, సుమారు 140 రోజుల పాటు జైలులో గడిపి ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో దాడి కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. వైసీపీ నేతలు ఇది రాజకీయ కక్ష సాధింపు అంటూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.