క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సినిమాల నుంచి కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల వరకూ.. తల్లి, అత్త, అక్క, చెల్లి వంటి పాత్రల్లో సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భావోద్వేగ సన్నివేశాల్లోనూ, హాస్యభరితమైన క్యారెక్టర్లలోనూ ప్రగతి నటన ఎప్పుడూ ప్రత్యేకంగా నిలిచింది.
ప్రగతిని గురించి మాట్లాడేటప్పుడు ఆమె ఫిట్‌నెస్ ప్రస్తావన తప్పనిసరి. వయసు సంఖ్య మాత్రమే అన్నట్టుగా, జిమ్‌లో చేసే కఠినమైన వర్కౌట్స్, పవర్‌లిఫ్టింగ్ ట్రైనింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సోషల్ మీడియాలో షేర్ చేసే వర్కౌట్ వీడియోలు యువతనే కాదు, మధ్య వయసు మహిళలకు కూడా పెద్ద ప్రేరణగా మారాయి. ఇటీవల అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని నాలుగు రజత పతకాలు సాధించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. సినిమా కెరీర్‌తో పాటు ఫిట్‌నెస్‌ను జీవితంలో కీలక భాగంగా మార్చుకున్న ప్రగతి.. తాజాగా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. ముఖ్యంగా రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
``లైఫ్‌లో ఒక తోడు అవసరమే. కానీ అది నా మెచ్యూరిటీ స్థాయికి తగిన వ్యక్తి కావాలి. అలా కాకుండా పెళ్లయ్యాక ఆంక్షలు, కండిషన్లు పెడితే నేను భరించలేను. 20 ఏళ్ల వయసులో అయితే అడ్జెస్ట్ అయ్యేదాన్నేమో… కానీ ఇప్పుడు నా ఆలోచనలు వేరు`` అని ఓపెన్‌గా మాట్లాడారు. ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆశ, ఆలోచన రెండూ లేవని కుండబద్దలు కొట్టారు. అలాగే తన పిల్లలే తన ప్రపంచమని, వారిని చూసి గర్వపడుతున్నానని చెప్పారు. కొడుకు బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా, కూతురు యూఎస్‌లో చదువుకుంటోందని ప్రగతి స్పష్టం చేశారు.