వైసీపీ అధినేత జగన్, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అయితే.. త్వరలోనే ఇద్దరూ ప్రజల మధ్యకు వచ్చేందుకు ఉద్యమాలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి గ్రాఫ్ ఎలా ఉన్నా.. రాజకీయాల గురించి ఆలోచిస్తే.. మాత్రం.. వారి పరిస్థితి ఏంటి? జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనేది ఆసక్తిగా మారింది. ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రులే తప్ప.. ప్రస్తుతం అంతగా యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదన్న వాదన ఉంది.
కానీ.. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం తపిస్తున్నారు. ఇదేసమయంలో వారు జనాల్లోకి వస్తే.. ఏమేరకు సిం పతీ గెయిన్ చేస్తారన్న చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఇద్దరూ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పొరపాట్లు కావొచ్చు.. ప్రత్యర్థులు చెబుతున్నట్టు అక్రమాలు కావొచ్చు.. ఇద్దరినీ వెంటాడుతున్నాయి. దీంతో ఇద్దరి గ్రాఫ్‌పైనా చర్చ సాగుతోంది. జగన్ విషయం మరింత ఎక్కువగా చర్చకు వస్తోంది. మూడు పార్టీలు కలిసి ఉండడం.. జగన్‌దిఒంటరి పోరు కావడంతో ఈచర్చకు మరింత ప్రాధాన్యం పెరిగింది.
మూడు పార్టీలూ మూకుమ్మడిగా ఎన్నికలకు వెళ్తే.. మళ్లీ తమకు అధికారం దక్కడం కష్టమన్న వాదన వైసీపీలోనే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కూటమి కట్టాలన్న వాదన కూడా.. చర్చకు వచ్చింది. తొలి నాళ్లలో దీనికి మొగ్గు చూపినా.. ఇప్పుడు కాదని అంటున్నట్టు సమాచారం. ``కూటమి మనకెందుకు.. మనం ఒంటరిగానే వెళ్తున్నాం`` అని అత్యంత సన్నిహితులతో జగన్ చర్చలు చేస్తున్నారు. అంతేకాదు.. ఈ దఫా గెలుపు తథ్యమని అంటున్నారు.
కానీ, జగన్ చెబుతున్నట్టుగా పరిస్థితి లేదన్న చర్చ మరోవైపు వైసీపీలోనే జరుగుతుండడం విశేషం. ఇది లావుంటే.. గత ప్రభుత్వంలో చేసిన తప్పులను కూటమి పార్టీలు ప్రజల మధ్యకు బలంగా తీసుకువెళ్లాల ని నిర్ణయించిన దరిమిలా.. ఇప్పుడున్న పరిస్థితి కంటే కూడా.. మరింత తీవ్రంగా జగన్‌పైనా.. వైసీపీ నేతలపైనా రాజకీయ యుద్ధం మరింత పెరుగుతుందని అంటున్నారు. దీనిని తట్టుకుని ఏమేరకు నిలబడతారు? అనేది చూడాలి. ఇక, కేసీఆర్ పరిస్థితి కూడా ఇలానే ఉందని తెలంగాణ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా.. ఇద్దరి ఆశలు ఏమేరకు నెరవేరుతాయో చూడాలి.