జాతిపిత మహాత్మా గాంధీని రెండో సారి చంపుతున్నారని కాంగ్రెస్ కీలక నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తాజా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరును మార్పు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన బిల్లును తాజాగా బుధవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలో జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళనాడుకు చెందిన చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 2005లో తానే తీసుకువచ్చానన్నారు.
ఈ పథకం కింద దేశవ్యాప్తంగా కోట్ల మంది పేదలకు మేలు జరుగుతోందని తెలిపారు. పల్లెలంటే మహాత్ముడికి ఎంతో ఇష్టమని.. పల్లె ప్రగతిని ఆయన స్వప్నించారని తెలిపారు. అందుకే గ్రామీణప్రాంతాల్లోని ప్రజలకు ఏటా 100 రోజుల ఉపాధి కల్పించేందుకు వీలుగా మహాత్మా గాంధీ పేరుతో పథకాన్ని తీసుకువచ్చామన్నారు. ఇప్పుడు ఆ పథకానికి పేరు మార్చడం అంటే.. ఖచ్చితం గా ఆయనను రెండో సారి హత్య చేయడమేనని చిదంబరం తెలిపారు. కేంద్రంలోని మోడీ సర్కారు ఇప్పటి వరకు జవహర్‌లాల్ నెహ్రూను టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో ఆయన ఇమేజ్‌ను తగ్గించే ప్రయత్నం చేసిందని తప్పుబట్టారు.
ఇప్పుడు దేశం యావత్తు గర్వించే మహాత్ముడి పేరును కూడా అలానే చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చిదంబరం వ్యాఖ్యానిం చారు. నేటి తరానికి గాంధీ గురించి తెలియకూడదన్న ఉద్దేశంతోపాటు.. ప్రజలు కూడా ఆయనను మరిచిపోయేలా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ పథకాన్ని పేరు మార్చడం అంటే.. గాంధీని రెండో సారి హత్య చేయడమేనని పదే పదే చెప్పారు. కాగా.. ఈ పథకం పేరును మార్చడం పట్ల బీజేపీయేతర, ఎన్డీయేయేతర ప్రభుత్వాలు కూడా తప్పుబట్టాయి. ఈ పథకం కింద 124 రోజలు పనిదినాలు కల్పిస్తున్నా.. నిధుల విషయంలో కేంద్రం మెలిక పెట్టేందుకు సిద్ధమైందని అంటున్నారు.