దేశ రాజకీయాల్లోనే కాదు.. పాలన, అభివృద్ధి, పారిశ్రామిక విధానాల పరంగా కూడా ఆంధ్రప్రదేశ్ మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించడం రాష్ట్రానికి గర్వకారణంగా మారింది. దేశంలోనే తొలిసారిగా ఈ అవార్డు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కడం ప్రత్యేక విశేషం.
ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ఎకనామిక్ టైమ్స్’ ఈ అవార్డును ప్రకటించగా, ఈ విషయాన్ని కలెక్టర్ల సదస్సులో మంత్రి అచ్చెన్నాయుడు అధికారికంగా వెల్లడించారు. ప్రకటన వెలువడగానే సదస్సులో ఉన్న మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, కలెక్టర్లు అందరూ ముఖ్యమంత్రికి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం ఆ క్షణాన్ని మరింత భావోద్వేగంగా మార్చింది. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలకు ఇది నిదర్శనమని ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పారదర్శక పాలన, వేగవంతమైన అనుమతుల విధానం వల్లే ఈ గుర్తింపు సాధ్యమైందని పేర్కొన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ స్పందిస్తూ.. ఇప్పటివరకు కేంద్రంలో ఉన్న నాయకులకే పరిమితమైన ఈ పురస్కారం, తొలిసారి ఒక రాష్ట్ర సీఎంకు రావడం దేశ చరిత్రలోనే తొలిసారి అని స్పష్టం చేశారు. గతంలో రాష్ట్రం దాదాగిరిని చూసింది. ఇప్పుడు అభివృద్ధి వైపు పరుగులు పెట్టే నాయుడుగిరిని చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక ఈ అవార్డుపై సీఎం చంద్రబాబు వినమ్రంగా స్పందించారు. “ఈ ఘనత తనది కాదు. తన సహచర మంత్రులు, అధికారులు, కలెక్టర్ల కృషి ఫలితం ఇది అని స్పష్టం చేశారు. తాను సాధారణంగా అవార్డులు స్వీకరించనని, గతంలో విదేశీ యూనివర్సిటీలు డాక్టరేట్లు ఇవ్వాలనుకున్నప్పటికీ సున్నితంగా తిరస్కరించానని గుర్తుచేశారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, ఇప్పుడు దానిని పునర్నిర్మించే దశలో ఉన్నామని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు గేర్ మార్చాం. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. కేవలం 18 నెలల్లోనే 25 కొత్త పాలసీలు తీసుకొచ్చామని చంద్రబాబు ఈ సందర్భంగా వెల్లడించారు.