బాలీవుడ్‌లో కొందరు నటులు తెరపై కనిపిస్తే చాలు.. సినిమా స్థాయి ఒక్కసారిగా మారిపోతుంది. అలాంటి అరుదైన నటుల్లో ఒకరు అక్షయ్ ఖన్నా. తాజాగా రణవీర్ సింగ్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ‘ధురంధర్’తో ఆయన క్రేజ్ మరోసారి ఆకాశాన్ని తాకింది. రెహ్మాన్ డకైట్ అనే పవర్‌ఫుల్ నెగటివ్ పాత్రలో అక్షయ్ ఖన్నా చేసిన నటనకు ప్రేక్షకులు మాత్రమే కాదు.. విమర్శకులు కూడా ఫిదా అయ్యారు. ప్రతి సీన్‌లో అక్షయ్ ఖన్నా తనదైన స్టైల్‌తో మెరిశారు. కళ్లతోనే భావాలు పలికించడం, డైలాగ్ డెలివరీలో గంభీరత, బాడీ లాంగ్వేజ్‌లో క్లాస్.. అన్నీ కలసి రెహ్మాన్ డకైట్ పాత్రను మరింత బలంగా నిలబెట్టాయి.
ఇదే ఏడాది ప్రారంభంలో విక్కీ కౌశల్ హీరోగా నటించిన ‘చావా’ సినిమాలో ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ‘చావా’ తర్వాత ‘ధురంధర్’… వరుసగా రెండు బలమైన పాత్రలతో అక్షయ్ ఖన్నా మళ్లీ టాప్ ఫామ్‌లోకి వచ్చారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్షయ్ ఖన్నా రియల్ లైఫ్ స్టోరీని తెలుసుకునేందుకు సౌత్ సినీ ప్రియులు కూడా ఆసక్తి చూపుతున్నారు.
ఎవరీ అక్షయ్ ఖన్నా..?
ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా కుమారుడే అక్షయ్ ఖన్నా. అయితే స్టార్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా.. గ్లామర్ హీరో ఇమేజ్ కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదు. కథ, పాత్ర బలంగా ఉంటే చాలు.. సైజ్ ఆఫ్ రోల్ గురించి ఆలోచించకుండా సినిమాలు చేయడం ఆయన ప్రత్యేకత. అందుకే తక్కువ సినిమాలే చేసినా.. అక్షయ్ ఖన్నాకు ఇండస్ట్రీలో ప్రత్యేక గౌరవం ఉంది.
2025 నాటికి అక్షయ్ ఖన్నా మొత్తం ఆస్తులు సుమారు రూ.167 కోట్ల వరకు ఉన్నాయని అంచనా. ముంబైతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో విలాసవంతమైన బంగ్లాలు, ఖరీదైన కార్లు ఆయన సొంతం. సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారు. అయినప్పటికీ ఆడంబరాలకు దూరంగా.. సింపుల్ లైఫ్‌స్టైల్‌తోనే జీవించడం ఆయనకు ఇష్టం.
ఇకపోతే అక్షయ్ ఖన్నా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. ప్రస్తుతం ఆయన వయసు సుమారు 50 సంవత్సరాలు. కానీ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. దీనిపై గతంలో ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆయన చాలా క్లారిటీగా స్పందించారు. “నాకు బాధ్యతలు వద్దు. నేను ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాను. ఎవరి గురించి ఆందోళన చెందకుండా నా జీవితాన్ని నేను ఆస్వాదించాలనుకుంటున్నాను. నాకు ఇప్పుడు ఉన్న జీవితం చాలా బాగుంది. దాన్ని ఎందుకు మార్చుకోవాలి?” అని అన్నారు. అంతేకాదు, “పెళ్లి అనేది చాలా పెద్ద నిబద్ధత. జీవితంలో భారీ మార్పు. నా జీవితంపై పూర్తి నియంత్రణ నాకు కావాలి. పెళ్లికి నేను సరైన వ్యక్తిని కాదు” అంటూ తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పారు. కుటుంబం లేదా సమాజం ఒత్తిడితో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం సరికాది ఆయన అభిప్రాయపడ్డారు.