మెడికల్ కాలేజీల అంశాన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకోవాలని వైసీపీ తెగ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే పీపీపీ విధానంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. పీపీపీ విధానంలో కాలేజీలు కట్టేందుకు ముందుకొచ్చిన వారందరినీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జైలుకు పంపుతామంటూ జగన్ వ్యాఖ్యానించడం బీజేపీ నేతలకు గట్టిగానే తాకాయి.
ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గురువారం మీడియా ముందుకు వచ్చి జగన్‌పై నిప్పులు చెరిగారు. “పీపీపీ విధానం తప్పయితే… దమ్ముంటే ముందుగా నన్నే జైలుకు పంపాలి” అంటూ సవాల్ విసిరారు. ఎవర్ని బెదిరిస్తున్నారో, ఎవర్ని జైలుకు పంపుతారో జగన్ స్పష్టత ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పీపీపీ విధానాన్ని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మాత్రమే కాదు, పార్లమెంట్ స్థాయి సంఘం, నీతి ఆయోగ్, జాతీయ వైద్య మండలి, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు సమర్థిస్తున్నాయని సత్యకుమార్ గుర్తుచేశారు. వీరందరితో పాటు ఈ విధానానికి శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీని సైతం జైలుకు పంపుతావా జగన్? అంటూ తీవ్ర వ్యంగ్యంతో ప్రశ్నించారు.
జగన్ రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌లపై విమర్శలు చేస్తూ రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఏపీకి విజిటింగ్ పొలిటీషియన్‌లా మారిన జగన్‌కు ప్రజల సమస్యలపై ఆసక్తి లేదని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే మెడికల్ కాలేజీల అంశాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు.
వైసీపీ హయాంలోనే మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఒక్కో కాలేజీకి రూ.600 కోట్ల వరకు ఖర్చు పెట్టేలా ఉత్తర్వులు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారని.. అవన్నీ బయటపడతాయన్న భయంతోనే ఇప్పుడు ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుట్రలు పన్నుతున్నారని సత్యకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. కోటి సంతకాల పత్రాలంటూ గవర్నర్‌ను సైతం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వందలాది జగన్లు వచ్చినా ఆ పార్టీ అధికారంలోకి రాదని.. ఆర్థిక నేరాల కేసుల్లో జగన్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని సత్యకుమార్ వ్యాఖ్యానించారు.