వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషి కొండను తొలిచి భారీ భవనాన్ని నిర్మించారు. మొత్తం ఏడు విభాగాలుగా.. అత్యంత విలాసవంతమైన సౌకర్యాలతో దీనిని నిర్మించారు. దీనిపై అప్పట్లోనే కొందరు హైకోర్టుకు కూడా వెళ్లారు. అయితే.. అవన్నీ.. పక్కన పెట్టి మరీ వైసీపీ ఆనాడు నిర్మాణం పూర్తి చేసింది. కాగా.. గత ఎన్నికల్లో కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. రుషికొండపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
దాదాపు 550 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసి.. ఎందుకూ కొరగాని భవనాన్ని నిర్మించారని.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా.. అందరూ ఆరోపించారు. ఇక, మీడియా కూడా అనేక రూపాల్లో ఈ భవనంపై కథనాలు రాసింది. వెండి ఫర్నిచర్, బంగారు కమోడ్ అంటూ.. పెద్ద ఎత్తున ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఇంత జరిగినా.. వైసీపీలో ఒకరిద్దరు నాయకులు స్పందించారే తప్ప.. పార్టీ అధినేతగా.. మాజీసీఎంగా ఉన్న జగన్ మాత్రం స్పందించలేదు.
ఈ క్రమంలో తాజాగా గురువారం ఆయన తొలిసారి రుషికొండ ప్యాలెస్‌పై స్పందించారు. ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానానికి ఇవ్వడాన్ని నిరసిస్తూ.. కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టిం ది. ఈ కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో సదరు కోటి సంతకాల బండిళ్లను గురువారం సాయంత్రం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి జగన్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడారు. విద్య, వైద్య , ప్రజా రవాణా వంటివి ప్రభుత్వ అధీనంలోనే ఉండాలని.. అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగానే తొలిసారి జగన్.. రుషికొండ భవనంపై స్పందించారు. రుషికొండపై నిర్మించిన భవనానికి కేవలం 230 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేశామని.. కానీ, చంద్రబాబు తనదైన శైలిలో దీనిని రెండు మూడు రెట్లు పెంచి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దీనికి సంబంధించిన బిల్లులు కూడా ప్రభుత్వం వద్దే ఉన్నాయన్నారు. ఇప్పుడు ఆ భవనం నగరానికి తలమానికంగా మారిందని ప్రభుత్వంలోని మంత్రులే చెబుతున్నారని తెలిపారు.
అయినా.. తమపార్టీపై లేనిపోని నిందలు వేస్తున్నారని చెప్పారు. ``ఇలాంటి అద్భుతమైన భవనం తాము ఎప్పుడూ చూడలేదని టాటా, బిర్లా వంటి అగ్రశ్రేణి వ్యాపార వేత్తలు చెబుతున్నారు. దీనిని తీసుకునేందు కు పోటీ పడుతున్నారు. ఇది నిజం కాదా? ప్రభుత్వానికి వారు ఇండెంట్లు పెట్టలేదా? `` అని జగన్ ప్రశ్నించారు. పర్యాటక ప్రాంతంలో అద్భుతమైన భవనాన్ని తక్కువ ఖర్చుతో నిర్మిస్తే.. దీనిని కూడా రాజకీయం చేశారు.. అని విమర్శించారు. అదే విశాఖపట్నంలో ఈ ఏడాది నిర్వహించి యోగాడేకు 350 కోట్ల రూపాయల ఖర్చు చేశారు. దీనిలో ఎవరు ఎంత తిన్నారో.. కూడా నిరూపిస్తామన్నారు. కానీ, తాము రూపాయి కూడా తినకుండా.. రుషికొండను నిర్మిస్తే.. దానిని వినియోగించుకోవడం చేతకాలేదని వ్యాఖ్యానించారు.