ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా మరోసారి వైసీపీపై విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వస్తే.. ప్రస్తుతం పెట్టుబడులు పెట్టేవారిని.. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించే వారిని బెదిరిస్తోంద న్న సీఎం.. అలా చేయడం వారి తరం కాదన్నారు. ఈ బెదిరింపులు వైసీపీ అజ్ఞానానికి నిదర్శనమని పేర్కొన్నారు. ``వైసీపీ రాజకీయ పార్టీ కాదు. అది బెదిరింపుల పార్టీ. నీచమైన నాయకులు ఉన్నారు. వారు అలానే మాట్లాడతారు. ఎవరూ వారికి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు`` అని చంద్రబాబు అన్నారు.
పీపీపీలను కేంద్రం కూడా సమర్థిస్తున్నట్టు సీఎం చెప్పారు. ``పీపీపీ మెడికల్ కళాశాలలు నిర్మించేందుకు ఎవరైనా ముందుకు వస్తే... అధికారంలోకి వచ్చాక జైల్లో పెడతామని కొందరు(వైసీపీ) బెదిరిస్తున్నారు. ఇలాంటి కామెంట్లు చేయడం వారి రాజకీయ అజ్ఞానానికి పరాకాష్ట. పీపీపీతో అభివృద్ధి జరుగుతుంది. పీపీపీ పద్దతిన ప్రాజెక్టులు చేపట్టినా... అది ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది. నిబంధనలు ప్రభుత్వమే చేస్తుంది. ప్రైవేటు వారు నిర్వాహకులు మాత్రమే. సీట్లు పెరుగుతాయి. ఫీజు ఏమాత్రం పెరగదు.`` అని చంద్రబాబు వివరించారు.
అంతేకాదు.. 70 శాతం ఎన్టీఆర్ వైద్యసేవ ప్రకారమే పేషెంట్లకు ఉచిత చికిత్స అందుతుందన్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు రెండేళ్లలోనే సిద్ధం అవుతాయని చెప్పారు. రాజకీయంగా విమర్శలు చేయొచ్చు కానీ, రౌడీయిజం చేస్తామంటే కంట్రోల్ చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. పీపీఏల రద్దుతో విద్యుత్ వ్యవస్థను నాశనం చేశారని గత వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. విద్యుత్ సంస్థల్లో 1,14,352 కోట్ల రూపాయల అప్పులు పేరుకుపోయాయన్నారు. 32,166 కోట్ల రూపాయల టారిఫ్ భారాన్ని ప్రజలపై వేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు వాటిని సరిదిద్దుతున్నామని వెల్లడించారు.
వైసీపీ ఇంకా అజ్ఞానంలోనే ఉందన్న చంద్రబాబు.. ప్రజలు తిప్పికొట్టినా.. కర్ర కాల్చి వాత పెట్టినా వారికి బుద్ధి రావడం లేదని దుయ్యబట్టారు. ఇలాంటి అజ్ఞానులకు మళ్లీ మళ్లీ బుద్ధి చెప్పేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.