ఐటీ దిగ్గజం.. `ఇన్ఫోసిస్` సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి, ప్రముఖ వ్యాపార వేత్త, సామాజి క ఉద్యమకారిణిగా కూడా గుర్తింపు పొందిన సుధామూర్తి దేశ ప్రజలకు కీలక విన్నపం చేశారు. ``నా మాట వినండి. నేను అలాంటిదాన్నికాదు`` అని ఆమె వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సుధామూ ర్తి.. తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తన ఫొటోలు, వీడియోలను ఉపయోగించి.. డీప్ ఫేక్ వీడియో లు సృష్టిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. ఇది వ్యంగ్యానికో.. సరదాకో అయితే.. తనకు అభ్యంతరం లేదన్నారు.
కానీ, కోట్ల మంది ప్రజలను తప్పుదోవ పట్టించేలా.. కొందరు సైబర్ నేరగాళ్లు తన వీడియోలు, వాయిస్, ఫొ టోలను కూడా వినియోగిస్తున్నట్టు సుధామూర్తి చెప్పారు. తాను ఎప్పుడూ.. అలా చేయలేదని.. కానీ, తనను తీవ్రంగా బాధించేలా ఈ వీడియోలు, ఫొటోలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన వీడియోలను వినియోగించి.. పెట్టుబడులు పెట్టాలని కొందరు ఆకర్షిస్తున్నారని చెప్పారు. పెట్టుబడులు పెడితే.. నెలకు 10 లక్షల రూపాయలు వస్తాయని తాను చెబుతున్నట్టుగా ప్రజలను మభ్య పెడుతున్నారని ఆమె అన్నారు.
అంతేకాదు.. ఇప్పటికే ఎంతోమంది ఇలా పెట్టుబడులు పెట్టి.. కోటీశ్వరులు అయ్యారని తాను చెబుతున్న ట్టుగా కూడా వీడియోలో వాయిస్ మార్ఫింగ్ చేస్తున్నారని సుధామూర్తి తెలిపారు. కానీ.. ఇవన్నీ.. సైబర్ నేరాలని.. ఎవరైనా పొరపాటున ఇలాంటి లింకులపై క్లిక్ చేస్తే.. డబ్బు పోతుందని.. దయచేసి ఎవరూ ఇలాంటి సాహసాలు చేయవద్దని ఆమె చెప్పారు. అసలు తాను ఇప్పటి వరకు ఎవరినీ.. ఇలా పెట్టుబడు లు పెట్టండి.. అలా పెట్టుబడులు పెట్టండి.. అని చెప్పలేదని.. అసలు వ్యాపార విషయాలను ప్రజలతోనే కాదు.. మీడియాతోనూ పంచుకునే టైపు కాదన్నారు.
ఇలాంటి తప్పుడు సమాచారం విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సుధామూర్తి కోరారు. తాను ఇప్పటికే ఈ వ్యవహారంపై సైబర్ పోలీసులకు సమాచారం ఇచ్చానని తెలిపారు. ``నేను ఇప్పటి వరకు ఎవరినీ పెట్టుబడుల పెట్టాలని కోరలేదు. కోరను కూడా. అసలు నేను అలాంటి దాన్నికాదు. నిజానికి నెలకు 10 లక్షలు వస్తే.. నాకెందుకు ఈ తిప్పలు(సరదాగా)`` అని సుధామూర్తి వ్యాఖ్యానించారు. కష్టపడకుండా.. ఎవరికీ రూపాయి కూడా రాదన్న విషయం తెలిసిందేనని.. కాబట్టి సైబర్ నేరగాళ్ల ఉచ్చుకు చిక్కుకోవద్దని ఆమె విన్నవించారు.