సీఎం చంద్రబాబు ఈ రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర జల శక్తి వనరుల శాఖా మంత్రి సి ఆర్ పాటిల్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరంతోపాటు ఏపీలోని పలు నీటిపారుదల ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల విడుదలపై ఆయనతో చంద్రబాబు చర్చించారు. విభజన హామీలలో భాగంగా ఆల్రెడీ ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కోరారు. నీటి భద్రత రాష్ట్రానికి ఎంతో కీలకమని, సాగు తాగునీటి అవసరాలకు ఎంతో ముఖ్యమని అన్నారు.
వాటిని దృష్టిలో ఉంచుకొని నిధుల విడుదలపై, అనుమతులపై కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రాజెక్టులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2025-26 సంవత్సరానికి గాను జల్ జీవన్ మిషన్ అమలు చేసేందుకు ఏపీకి అదనంగా 1000 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆల్రెడీ రాష్ట్ర వాటా 524 కోట్లు ఖర్చు చేశామని, కేంద్ర వాటా నిధులు కూడా విడుదల చేయాలని కోరారు. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ నీటిపారుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీ ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్, పలువురు టీడీపీ ఎంపీలు ఉన్నారు.