భారత్ మీద ఎన్నోసార్లు ప్లాన్ చేసి మరీ ఉగ్రదాడి చేయించినప్పటికీ చాలాసార్లు ముప్పు తప్పించుకున్న పాకిస్థాన్.. పహల్గాం దాడి తర్వాత మాత్రం భారత్ ఎదురుదాడిని తట్టుకోలేకపోతోంది. సింధు జలాల ఒప్పందం నుంచి బయటికి రావడంతో పాటు పాక్ పీచమణిచే చర్యలు చాలానే చేపట్టిన భారత్.. తాజాగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భీకర దాడితో ఆ దేశాన్ని చావు దెబ్బ కొట్టింది.
భారత్ దాడి అనంతరం పాక్ రక్షణ మంత్రి సీఎన్ఎన్‌తో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తమ సైన్యం భారత్‌కు చెందిన అయిదు యుద్ధ విమానాలను కూల్చేసినట్లుగా పాక్ ఘనంగా స్టేట్మెంట్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. స్వయంగా ఆ దేశ ప్రధానే పార్లమెంటులో ఈ మేరకు ప్రకటన చేశారు. ఐతే దీనికి సంబంధించి మీ దగ్గర ఆధారాలున్నాయా అని సీఎన్ఎన్ ప్రతినిధి.. పాక్ రక్షణ మంత్రిని ప్రశ్నించారు. దీనికి ఆయనిచ్చిన సమాధానం వింటే దిమ్మదిరిగిపోతుంది.
భారత యుద్ధ విమానాలను పాక్ కూల్చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టులున్నాయని.. ఈ పోస్టులు పెట్టింది పాకిస్థానీలు కాదని, ఇండియా వాళ్లే అని ఆయన వింత సమాధానం ఇచ్చారు. సోషల్ మీడియా పోస్టులు ఆధారాలు ఎలా అవుతాయి అన్నా ఆయన్నుంచి సమాధానం లేకపోయింది. మరోవైపు పాకిస్థాన్ సమాచార మంత్రి తరార్‌తో స్కై న్యూస్ ప్రతినిధి హకీమ్ చేసిన ఇంటర్వ్యూలో సైతం ఇలాగే పాక్ పరువు పోయింది. తమ దేశం ఉగ్రవాదానికి ఎంతమాత్రం సహకరించదని.. తామే ఉగ్రవాద బాధితులమని అతను చెప్పగా.. తమ దేశం సుదీర్ఘ కాలంగా ఉగ్రవాదులకు మద్దతుగా నిలుస్తున్న విషయాన్ని స్వయంగా పాక్ రక్షణ మంత్రి అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించి అతడికి చెక్ పెట్టింది స్కై న్యూస్ ప్రతినిధి.
ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్‌లో దాక్కుని ఉంటే.. పాక్ మీద నమ్మకం లేక అమెరికా అక్కడ మిషన్ చేపట్టి లాడెన్‌ను చంపిన విషయాన్ని స్కై న్యూస్ యాంకర్ ప్రస్తావించడంతో పాక్ మంత్రి నుంచి సమాధానం లేకపోయింది. ఇలా భారత్ దాడిపై ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతున్న పాక్ ప్రతినిధులందరూ ఆ దేశ పరువును ఇంకా తీస్తున్నారే తప్ప దేశం తరఫున బలంగా గళం వినిపించలేకపోతున్నారు.