నాయకుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కఠినంగా ఉంటానని.. క్షేత్రస్థాయి కార్యక్రమాలు.. కార్యకలాపాల్లో పాల్గొనని వారిని ఊరుకునేది లేదని చెబుతున్నారు. ఇది వాస్తవమే.. అధికారంలో ఉన్నా కూడా ఆయన పార్టీ కోసం సమయం ఇస్తున్నారు. పాలనా వ్యవహారాల్లో తలమునకలై ఉండి కూడా పార్టీ తరఫున ఏం జరుగుతోందన్న విషయంపై ఆయన ఆరా తీస్తున్నారు. పార్టీ కార్యాలయానికి తరచుగా వెళ్తున్నారు. పార్టీకి సమయం కేటాయిస్తున్నారు.
గత 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు.. పార్టీకి సమయం ఇవ్వకపోవడంతో ఏం జరిగిందో అధ్యయ నం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నే చంద్రబాబు పంథా మార్చారు. పింఛన్ల పంపిణీ కోసం నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు, పార్టీ కార్యక్రమా లపై ఆరా తీస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి కార్యకర్త ల వరకు ఆయన భేటీ అవుతున్నారు. సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా తన దృష్టికి వస్తున్న సమస్యలను తెలుసుకుంటున్నారు. కేడర్ చెబుతున్న సమస్యల ను ఓపికగా వింటున్నారు. పార్టీ అండగా ఉంటుందన్న భరోసానిస్తూ వారిలో ఉత్సాహం నింపుతున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తున్నారు. ఇతర చెక్కులను నేతల ద్వారా ఇవ్వాలని సూచిస్తున్నారు. అయితే. చంద్రబాబు ఎంత చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆశించిన మార్పు అయితే.. కనిపించడం లేదు. సంబంధిత చెక్కుల్ని బాధితులకు అందజేయడంలో జాప్యం చేస్తున్నారు.
ఈ పరిస్థితిలో మార్పు కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు మరింత పుంజుకోనున్నాయి. జనవరి నుంచి నేరుగా చంద్రబాబు దృష్టి పెట్టనున్నారు. కూటమితో కలివిడిగా ఉంటూ.. ప్రజల మధ్య ఉండే నాయకులకు ప్రాధాన్యం పెంచనున్నారు. అంతేకాదు.. ఎమ్మెల్యేలు.. ఎంపీలనే తేడా లేకుండా.. ప్రజల మధ్య ఉండేవారికే ప్రాధాన్యం ఇవ్వాలని తాజాగా నిర్ణయించారు.
ఈ విషయంలో తాజాగా కలెక్టర్ల సదస్సు నుంచి కూడా సమాచారం సేకరించారు. ఏయే ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తున్నారన్న విషయాన్ని కూడా ఆయన తెలుసుకున్నారు. ఆ మేరకు మార్పుల దిశగా అడుగులు వేయనున్నారు. మెప్పు కోసం కాకుండా.. ప్రజల కోసం పనిచేసేవారికే టికెట్లు కూడా ఇవ్వాలని ప్రాధమికంగా నిర్ణయించారు. ఈ దిశగా చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు.