దేశ రాజధాని ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులను వరుసగా కలుస్తూ.. బిజీబిజీగా గడు పుతున్నారు. ఈ నెలలో సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం.. ఇది రెండోసారి. కాగా.. శుక్రవారం నాటి పర్యట నలో తొలుత కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీ.ఆర్.పాటిల్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై చర్చించా రు. ముఖ్యంగా విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం చేయాలని, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని విన్నవించారు.
ఏపీలో సాగు, తాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర–రాష్ట్ర సమన్వయం మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం రాష్ట్రానికి అదనంగా వెయ్యి కోట్ల రూపాయల కేటాయించాలని విన్నవించారు. జల్ జీవన్ మిషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.524.41 కోట్లు ఖర్చు చేశామని, అలాగే దీనికి సంబంధించిన కేంద్ర వాటా నిధులను కూడా విడుదల చేయాలని సీఎం కోరారు.
అదేవిధంగా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద చెరువులు, కాలువల పునరుద్ధరణకు రాష్ట్రం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని పాటిల్ దృష్టికి సీఎం తీసుకువచ్చారు. ఈ పథకానికి సంబంధించి కేంద్రం వాటా నిధులు వెంటనే విడుదల చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి సామర్థ్యం గణనీయంగా పెంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టులో వివిధ పనులకు సంబంధించి పెండింగులో ఉన్న అనుమతులు వెంటనే వచ్చేలా చూడాలని కోరారు.
ఆర్థిక మంత్రి నిర్మలతోనూ..
సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ భేటీ అయ్యారు. పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా చేయూత ఇవ్వాలని కోరారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి విన్నవించారు. పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని పరోక్షంగా తెలంగాణ వ్యక్తం చేస్తున్న ఆందోళనను చంద్రబాబు తెలిపారు. దేశంలోని తూర్పు ప్రాంత రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడే పూర్వోదయ పథకం వికసిత్ భారత లక్ష్యాన్ని చేరుకునేందుకు, జాతీయ ఆర్ధిక వ్యవస్థకు చోదకశక్తిగా నిలుస్తుందని వివరించారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన కీలక అంశాలు చర్చించారు.