వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కాంట్రాక్టర్లను ఉద్దేశించి.. సీరియస్ అయ్యారు. కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి మార్కాపురం, మదనపల్లె, ఒంగోలులో నిర్మించనున్న మెడికల్ కాలేజీలకు ఇప్పటికే టెండర్లు కూడా ఆహ్వానించింది. అయితే.. కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. ఈ కార్యక్రమాన్ని ఈ నెలలో మరింత జోరుగా ముందుకు తీసుకువెళ్లి.. వచ్చిన వారికి వచ్చినట్టు.. ఇచ్చేయాలని భావిస్తోంది.
అయితే.. ఈ విషయంపైనే తాజాగా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా ముందుకు వచ్చి పీపీపీ విధానంలో ఒప్పందం చేసుకుంటే.. తాము అధికారంలోకివచ్చాక.. జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. వాస్తవానికి ఇలాంటి హెచ్చరికలు సరికావన్నది అందరికీ తెలిసిందే. అయినప్పటికీ.. జగన్ ఈ ప్రకటన చేశారు. తద్వారా.. ఆయన రెండో ఉపాయం ఎంచుకున్నట్టు అయింది. ఈ హెచ్చరికలకు బెదిరి కాంట్రాక్టర్లు ముందుకు రాకుండా ఉంటారని జగన్ భావిస్తున్నారు.
ఈ వ్యవహారంపై.. కలెక్టర్ల సదస్సులోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. కలెక్టర్ల సదస్సు ముగిసిన తర్వాత.. జరిగిన అంతర్గత సమావేశంలో జగన్ చేసిన హెచ్చరికలపైసీఎంచంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు చర్చించారు. ఇలాంటి హెచ్చరికలు సరికాదన్నది పవన్ చెప్పిన మాట. తాను చూసుకుంటానని.. ప్రజల మధ్యకు తానే స్వయంగా ఈ విషయాన్ని తీసుకువెళ్లి ప్రజలతోనే ఒప్పిస్తానని కూడాచంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం.
ఈ క్రమంలో ప్రధానంగా 104, 108 వాహనాలను గతంలో కాంట్రాక్టు సంస్థలకు ఇచ్చిన విషయాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేయనున్నారు. అదేవిధంగా జగన్‌ను మరింత డైల్యూట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అలానే.. రాజకీయంగా కూడా.. పవన్ దూకుడు పెంచనున్నారని తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందున్న పరిస్థితి మాదిరిగానే ప్రస్తుతం కూడా.. జగన్‌పై పవన్ ఎదురు దాడి చేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. జగన్‌తో పోల్చుకుంటే.. పవన్ మాటలకు ప్రాధాన్యం ఉంటుందన్న నేపథ్యంలో ఈ విషయంలో చంద్రబాబు కూడా.. ఆయనకే బాధ్యతలుఇచ్చే అవకాశం ఉంది.