నేతల్ని ఉత్సాహ పర్చాలి. క్యాడర్ ను ఖుషీ చేయాలి. వారి అంచనాలకు తమ ఆలోచనలు ఏ మాత్రం తగ్గట్లేదన్నట్లుగా మాట్లాడాలి. రాజకీయ ప్రత్యర్థులకు కొత్త సందేశాన్ని ఇవ్వాలి.. ఇలాంటి టాస్కుల్ని మదిలో పెట్టుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్.. అందుకుతగ్గట్లే తాజా వ్యాఖ్యల్ని చేస్తున్నట్లుగా చెప్పాలి. తాజాగా రాజమహేంద్రవరంలో నిర్వహించిన పట్టణ నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రెండీ మాటల్ని తన నోట వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్న లోకేశ్.. తాము ఇప్పటికే చాలా చేశామని.. ఇకపైనా చేస్తామన్న సంకేతాల్ని తన మాటలతో చెప్పే ప్రయత్నం చేశారని చెప్పాలి.
‘‘ఎంత మంచి సినిమా అయినా అందులో చిన్న విలన్ ఉంటాడు. మనకూ ఒక విలన్ ఉన్నాడు. ఆయనొస్తే అరెస్టు చేస్తారట. మన నాయకుడ్ని జైల్లో వేసి ఏం చేయగలిగారు? ఇప్పుడు ఆయన బెదిరింపులకు మనం భయపడాలా? ఆయన కంటే ముందు ఇలానే మాట్లాడిన వారి పరిస్థితి ఇప్పుడేమైందో గుర్తు తెచ్చుకోండి’’ అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు రెడ్ బుక్ అంటూ కొత్త ట్రెండ్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఆయన.. అధికారంలోకి వచ్చిన తర్వాత సందర్భానుసారం రెడ్ బుక్ ప్రస్తావన తేవటం తెలిసిందే.
తాజాగా అలాంటి తీరునే మరోసారి ప్రదర్శించారు. రెడ్ బుక్ లో మూడు పేజీలే అయ్యాయని.. ఇంకా చాలానే ఉన్నాయన్న ఆయన.. ఎవరికి ఎప్పుడు ముహుర్తం పెట్టాలో తనకు బాగా తెలుసంటూ వార్నింగ్ ఇవ్వటం గమనార్హం. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదన్న ఆయన.. ‘‘ఈ మధ్యన వారు ఎగిరెగిరి వస్తున్నారు. రప్పారప్పా అంటున్నారు. మేం రెండు రప్పాలిస్తాం’’ అంటూ మాట్లాడారు.
‘రప్పారప్పా’ మాటల్ని ఒకవైపు తీవ్రంగా తప్పు పడుతున్నపార్టీలో ఆ తరహా మాటల్ని క్యాడర్ సమావేశాల్లో ప్రస్తావించటం సరైనదేనా? అన్నది లోకేశ్ ఆలోచించుకోవాలని చెబుతున్నారు. ఓవైపు ప్రత్యర్థి పార్టీ అధినేత.. పార్టీ నేతల తీరును వేలెత్తి చూపిస్తున్నప్పుడు.. అదే తరహాను ప్రదర్శించటం ఎంతవరకు సబబు? అన్నది మరో ప్రశ్న. ఇదంతా ఒక ఎత్తు అయితే లోకేశ్ మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
తమ రాజకీయ ప్రత్యర్థి జగన్ తో తాను ఎంత పోరాడానో.. పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు సొంతవారితోనూ తాను అంతే పోరాడినట్లుగా చెప్పటం గమనార్హం. మారిన కాలానికి అనుగుణంగా మార్పులు తీసుకొస్తున్నామన్న లోకేశ్ మాటల్ని చూస్తే.. పార్టీ తీరును మార్చేందుకు తాను తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పటం కనిపిస్తుంది. ఈ రోజుకు పార్టీ అధినేత చంద్రబాబుతో పోరాడతానని.. కానీ ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే తలవంచి దాన్ని అమలు చేసే వ్యక్తిగా తనను తాను చెప్పుకోవటం లోకేశ్ మాటల్లో కనిపిస్తుంది.