ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని డిసెంబర్ 23 నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కడప జిల్లా పులివెందులలో పర్యటించేందుకు ప్రణాళికలు రచించుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇవాళ జరగాల్సిన పులివెందుల పర్యటనను హఠాత్తుగా క్యాన్సిల్ చేశారు.
తాజా సమాచారం ప్రకారం వైఎస్ జగన్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. గత రెండు రోజులుగా స్వల్ప అస్వస్థత ఉన్నప్పటికీ, వైద్యుల పరీక్షల అనంతరం పూర్తి విశ్రాంతి అవసరమని సూచించినట్లు సమాచారం. దీంతో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా పులివెందుల పర్యటనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని వైసీపీ అధికారికంగా కూడా ధృవీకరించింది. పార్టీ ‘ఎక్స్’ ఖాతా ద్వారా జగన్ ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్ ఇచ్చింది.
ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారని, పూర్తిగా కోలుకున్న తర్వాతే ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపింది. ఇక పులివెందుల పర్యటనలో భాగంగా పార్టీ శ్రేణులతో సమావేశాలు, స్థానిక నేతలతో చర్చలు, పలు కార్యక్రమాలు ప్లాన్ చేయగా… ఒక్కసారిగా వాటికి బ్రేక్ పడటం కార్యకర్తల్లో కొంత ఆందోళనకు కారణమైంది. అయితే ఇది సాధారణ జ్వరమేనని, ఆందోళన అవసరం లేదని వైసీపీ నేతలు భరోసా ఇస్తున్నారు. జగన్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజల మధ్యకు రావాలని పార్టీ శ్రేణులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన అనంతరం పులివెందుల పర్యటనను తిరిగి షెడ్యూల్ చేస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.