అధికారంలోకి రావటం ఇట్టే జరిగిపోదు. దానికి చాలానే పరిణామాలు.. అంశాలు ముడిపడి ఉంటాయి. ప్రపంచంలోని ఏ సమాజమైనా స్వేచ్ఛగా బతకాలని కోరుకుంటుంది. హింసను అస్సలు ఇష్టపడదు. అలాంటప్పుడు భారతదేశంలో.. అందునా ఆంధ్రప్రదేశ్ లాంటి సామాజిక చైతన్యం ఎక్కువగా ఉండే ప్రాంతంలో అధికారాన్ని అందిపుచ్చుకోవటానికి అనుసరించాల్సిన వ్యూహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందునా.. ఐటీ విప్లవంతో ఏపీకి చెందిన లక్షలాది మంది విదేశాల్లో సెటిల్ కావటం..అక్కడి నుంచి వచ్చే ఆదాయంతో సామాజిక పరిస్థితుల్లో మార్పుల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది.
హింస కంటే ప్రేమతో మనసుల్ని దోచుకోవటం చాలా తేలిక. భయంతో అన్ని పనులు చేయించుకోలేమన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఒకవేళ భయపడుతున్నట్లుగా కనిపిస్తే అది ఉత్త నటనే తప్పించి మరింకేమీ కాదు. ఎవరూ కూడా తమ బతుకుల్ని హింసకు.. భయానికి బలి చేసుకోవాలని అనుకోడు. ఈ విషయాన్ని వైసీపీ అధినాయకత్వం ఎందుకు మిస్ అవుతుందన్నది ప్రధాన ప్రశ్న. తన రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరుష వ్యాఖ్యలు చేయటాన్ని అందరూ అర్థం చేసుకుంటారు.
అధినేతకు మించి ఆరు ఆకులు ఎక్కువ చదివినట్లుగా వ్యవహరించే క్యాడర్ తోనే ప్రధాన సమస్య. వైసీపీ క్యాడర్ తరచూ రక్త భాషలో మాట్లాడటం జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందన్నది మర్చిపోకూడదు. జగన పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం ఏపీతో పాటు తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోనూ సందడి కనిపించింది. అయితే.. ఇది పరిమితులకు దాటకూడదు. తమ అభిమాన అధినేత పుట్టినరోజును ఆహ్లాదంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తాము అభిమానించే నాయకుడు అందరికి ఆమోదయోగ్యుడన్న భావన అందరిలోనూ కలిగేలా వ్యవహరించాలి.
అంతే తప్పించి.. సదరు అధినేతను అభిమానించేటోళ్లే ఇలా ఉంటే.. ఆయన ఇంకెలా ఉంటాడన్న భావన కలుగనీయకూడదు. ఈ విషయంలో వైసీపీ వ్యూహకర్తలు మొదలు సామాన్య కార్యకర్త వరకు వ్యవహరిస్తున్న తీరు అందరివాడిగా ఉండాల్సిన జగన్.. కొందరివాడిగా మారుతున్న విషయాన్ని మర్చిపోకూడదు. జగన్ మీద ఎంత అభిమానం ఉంటే మాత్రం.. ఆయన పుట్టినరోజున పెద్ద ఎత్తున పొట్టేళ్లను బహిరంగంగా తల నరికి.. ఆ రక్తాన్ని జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేయటాన్ని సామాన్యులు ఎలా చూస్తారు?
తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగన్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో.. ‘‘2029లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు రప్పారప్పా నరుకుతాం ఒక్కొక్కడిని’’ అంటూ పేర్కొన్న వైనం ఎవరికి మేలు చేస్తుంది? తాము అమితంగా ఆరాధించే జగన్ కు.. ఇలాంటి రాతలు మేలు చేస్తాయా? అన్నది ఆయన అభిమానులు భావించొచ్చు.
కానీ.. వైసీపీ వ్యూహకర్తలు ఇలాంటి తీరును సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది కదా? అలాంటివి చేయకుంటే అధికార దిశగా అడుగులు పడవన్న విషయాన్ని గుర్తించాలి. ఏ సమాజం హింసతో కూడిన అధికారాన్ని అప్పజెప్పాలని కోరుకోదు. ఈ విషయాన్ని వైసీపీ నేతలు ఎందుకు మిస్ అవుతున్నట్లు?