2025లో వైసీపీ పరిస్థితి ఏంటి? ప్రధాన ప్రతిపక్షం కాకపోయినప్పటికీ 11 స్థానాలు దక్కించుకున్న నేపథ్యంలో ప్రతిపక్షంగా ప్రజలకు ఏమేరకు చేరువయ్యింది. అనే విషయాలు ఆసక్తిగా మారాయి. ఏ పార్టీకైనా ఒక సంవత్సరం కాలం చాలా ముఖ్యమైనది. ఈ క్రమంలో చూసుకున్నప్పుడు వైసిపి రాజకీయాలు ఎలా ఉన్నాయి అనేది ఆసక్తిగా మారింది. అధినేత విషయాన్ని పక్కన పెడితే పార్టీ నాయకుల మధ్య సమన్వయం ఎలా ఉంది? పార్టీ నాయకులు ప్రజలకు చేరువ అవుతున్నారా అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి.
కొన్ని కొన్ని జిల్లాల్లో పార్టీ పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ మరికొన్ని జిల్లాల్లో మాత్రం తీవ్ర ఇబ్బందికర పరిస్తితులు ఎదుర్కొనేలా మారింది. ఉదాహరణకు పల్నాడు జిల్లాలో పార్టీ పరిస్థితి మైనస్‌లోకి వెళ్లిపోయింది. అక్కడ పార్టీ కీలక నాయకుడుగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు కావడం మిగిలిన నాయకులు కూడా కేసులకు భయపడి సైలెంట్ అయిపోవడంతో పల్నాడు జిల్లాలో వైసిపి దాదాపు మైనస్‌లోకి చేరింది. ఇదే జిల్లా నుంచి అంబటి రాంబాబు పార్టీ తరపున వాయిస్ వినిపిస్తున్నప్పటికీ తరచుగా అయినా కొన్ని కొన్ని విషయాల్లో కోటమి ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ వస్తున్నారు.
నేరుగా ప్రభుత్వాన్ని ప్రశంసించకపోయినా విధానాలు బాగున్నాయంటా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీసాయి. ఇక, ఉభయగోదావరి జిల్లాల విషయానికి వస్తే కీలక కాపు నాయకులు పార్టీకి దూరమయ్యారు. ఉన్న వారు మౌనంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా దూకుడుగా వ్యవహరించే నాయకులు పూర్తిస్థాయిలో మౌనం పాటిస్తూ వచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో సోషల్ మీడియాపై కూటమి ప్రభుత్వం ఉక్కు పాదం మోపడంతో సోషల్ మీడియాలో కార్యకర్తలుగా సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేసే నాయకులుగా గుర్తింపు పొందిన చాలా మంది జైలు పాలయ్యారు.
తర్వాత బెయిల్ పై బయటకు వచ్చినా వారు సైలెంట్ అయిపోయారు. ఇక గుంటూరు జిల్లా బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా ఒకప్పుడు యాక్టివ్గా ఉండేవారు. ఇటీవల కాలంలో ఆయన కూడా సైలెంట్ అయ్యారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి వస్తే రెడ్డి సామాజిక వర్గం వైసీపీకి చేరువ అవుతున్నప్పటికీ సైలెంట్ గానే కార్యకలాపాల్లో పాల్గొంటోంది. ఎక్కడా కూడా దూకుడుగా వ్యాఖ్యానించటం లేదు. ఇక జగన్ పిలుపునిస్తున్న మేరకు జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
అయితే వాటిలో కూడా కొంతమంది నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం వంటి జిల్లాలో పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగానే మారింది. ఈ ఏడాది పరిస్థితులను అంచనా వేసుకొని వచ్చే ఏడాదికి పుంజుకుంటారా లేకపోతే వచ్చే ఎన్నికల వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందనేది చూడాలి. ఇది ఎలా ఉన్నప్పటికీ 2025, వైసీపీ రాజకీయాలు పెద్ద ఆసక్తిగా అయితే ముందుకు సాగలేదు. ప్రజలకు కూడా చేరువ కాలేదన్నది వాస్తవం.