ఏపీ రాజధాని అమరావతిలో ఎవరూ ఊహించని అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ముఖ్యంగా నాలెడ్జి ఎకానమీ, క్వాంటం వ్యాలీగా దేశానికే మార్గదర్శిగా మారుతుందన్నారు. మంగళవారం నిర్వహించిన `క్వాంటం టాక్ బై సీఎం సీబీఎన్` కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. పలు అంశాలను వివరించారు. ఐటీ విప్లవం అందిపుచ్చుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ నిపుణుల్ని తయారు చేసి ప్రపంచానికి అందించామన్నారు
సైబరాబాద్ నిర్మాణం ద్వారా హైదరాబాద్ ఐటీ గ్లోబల్ హబ్ గా ఎదిగిందని తెలిపారు. ``సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, అరవింద్ కృష్ణ లాంటి భారతీయులే గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలకు నాయక త్వం వహిస్తున్నారు. విశాఖలోనూ ఇప్పుడు గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ ను ఏర్పాటు చేయబోతోంది. గతంలో ఐటీఈఎస్ లాంటి సేవల్ని వివిధ దేశాలకు ఇక్కడి నుంచే అందించాం`` అని తెలిపారు. కాగా.. విశాఖ ఇప్పుడు డేటా సెంటర్లకు గ్లోబల్ హబ్ గా మారనుందని చంద్రబాబు చెప్పారు.
రాష్ట్ర రాజధాని అమరావతి కూడా ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్‌లో రానున్న రోజుల్లో అనేక అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నగరాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చంద్రబాబు చెప్పారు. తిరుపతి స్పేస్ సిటీగా నిర్మితం అవుతుందన్న ఆయన.. అనంతపురం, కడప లాంటి ప్రాంతాలు ఎలక్ట్రానిక్స్ ఏరో స్పేస్ కేంద్రాలుగా ఉంటాయని చెప్పారు.
విశాఖ- చెన్నై, చెన్నై బెంగుళూరు, బెంగుళూరు- హైదరాబాద్ కారిడార్ లు అతిపెద్ద పారిశ్రామిక కారిడార్లుగా మారుతున్నాయని తెలిపారు. ఏపీని క్వాంటంతో పాటు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుస్తున్నామని చెప్పారు. వచ్చే 20 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఇప్పుడే కార్యరూపం ఇస్తున్నామని, అమరావతిలో క్వాంటం వ్యాలీ ద్వారా ఓ ఎకో సిస్టమ్ ను తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు వివరించారు.