కూటమి నాయకులు.. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు గత ఏడాది ఎన్నికలకుముందు ప్రకటించి న సూపర్ సిక్స్ పథకాలను ఈ ఏడాదినుంచే అమలులోకి తీసుకువచ్చారు. ప్రధానంగా తల్లికి వందనం పథకాన్ని ఈ ఏడాది ఆగస్టు నుంచి అమలు చేశారు. వాస్తవానికి జూన్ నుంచే అమలు చేయాలని అనుకు న్నా.. కుదరలేదు. దీంతో ఆగస్టు నుంచి అమలు చేసి.. రికార్డు స్థాయిలో తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే.. అంతమందికీ నిధులు ఇస్తామన్న ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. ఆరుగురు, ఏడుగురు పిల్లలు ఉన్న కుటుంబాలకు కూడా నిధులు ఇచ్చారు.
ఇక, మరో కీలక పథకం.. అన్నదాత సుఖీభవ. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి మేలు చేసే ఈ పథకాన్ని కూడా ఈ ఏడాదే ప్రారంభించారు. ఎన్నికలు పూర్తయ్యాక అమలు చేయాలని అనుకున్నా.. రికార్డులు సరిగా లేకపోవడంతో ఈ ఏడాది జూన్ నుంచే అన్నదాత సుఖీభవ పథకాన్ని గాడిలో పెట్టారు. దీని కింద రైతులకు రూ.5000 చొప్పున కేంద్రం ఇచ్చే సొమ్ముతో కలిపి రూ.7000 చొప్పు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇటీవల అక్టోబరులోనూ రెండో విడత సొమ్ములు ఇచ్చారు.
అదేవిధంగా సూపర్ సిక్స్‌లో మరో కీలక పథకం డీఎస్సీ. దీనిని కూడా 2025లోనే పూర్తి చేశారు. మొత్తం 6 వేల పైచిలుకు ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. ఎక్కడా ఎలాంటి న్యాయపరమైన వివాదాలు రాకుండా.. జాగ్రత్తలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ముగించారు. ఇక, తల్లికి వందనం కార్యక్రమంలో ఇబ్బంది పడే అవకాశం ఉందని గ్రహించి ఆటో కార్మికులు, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ. 15000 చొప్పున ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ఏడాదే ప్రభుత్వం అమలు చేయడం విశేషం.
అదేవిధంగా సూపర్ సిక్స్‌లో మిగిలిన కార్యక్రమాలను కూడా అమలు చేసేందుకు ప్రయత్నించారు. ఇక, చంద్రబాబు ఎప్పటి నుంచో ప్రవచిస్తున్న పీ-4ను కూడా ఈ ఏడాదే గాడిలో పెట్టారు. పేదలను దత్తత తీసుకునే వారిని ప్రోత్సహించారు. స్వయంగా చంద్రబాబు 200 కుటుంబాలను దత్తత తీసుకుని ఆదర్శంగా నిలిచారు. అదేవిధంగా టీడీపీకి చెందిన మంత్రులు సవిత, సంధ్యారాణిలు కూడా తమ తమ నియోజకవర్గాల్లోని పేదలను దత్తత తీసుకున్నారు. ఇలా.. ఈ ఏడాది సంక్షేమ నామ సంవత్సరంగా కూడా ఏపీ ప్రజలకు మేలు చేసిందనే చెప్పాలి.