గంధం చంద్రుడు టు ఆమ్రపాలి.. ఏపీలో 5 గురు ఐఏఎస్‌లకు ప్ర‌మోష‌న్‌!

admin
Published by Admin — December 28, 2025 in Politics, Andhra
News Image

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పరిపాలన విభాగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2010 బ్యాచ్‌కు చెందిన ఈ అధికారులకు ప్రభుత్వ కార్యదర్శి హోదాకు సమానమైన 'సూపర్ టైమ్ స్కేల్' (పే మ్యాట్రిక్స్ లెవల్-14) కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కె. విజయానంద్ ఈ మేరకు అధికారిక జీవో విడుదల చేశారు. ఈ పదోన్నతులు 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త ఏడాది ప్రారంభంలోనే ఈ అధికారులకు కొత్త హోదాలు దక్కనుండటంతో అడ్మినిస్ట్రేషన్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పదోన్నతి పొందిన వారిలో చదలవాడ నాగరాణి, డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఆమ్రపాలి కాట, జె. నివాస్, గంధం చంద్రుడు ఉన్నారు.

అయితే పదోన్నతి పొందినప్పటికీ, పరిపాలనా సౌలభ్యం కోసం కొందరు అధికారులను వారి ప్రస్తుత బాధ్యతల్లోనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా చదలవాడ నాగరాణి, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) వీసీ & ఎండీగా ఆమ్రపాలి కాట తమ ప్రస్తుత బాధ్యతల్లోనే కొనసాగుతారు. డాక్టర్ నారాయణ భరత్ గుప్తా పదవిని కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్‌గా ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించింది. 

యువ అధికారి గంధం చంద్రుడుకు కీలకమైన కార్మిక శాఖ కమిషనర్‌గా కొత్త బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు ఈ పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎం.వి. శేషగిరి బాబు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక జె. నివాస్‌కు సూపర్ టైమ్ స్కేల్ పదోన్నతి కల్పించిన ప్రభుత్వం, ఆయనకు కేటాయించే కొత్త పోస్టింగ్ పై త్వరలో స్పష్టత ఇవ్వనుంది. కాగా, ఈ పదోన్నతులు కేవలం సాధారణ ప్రక్రియలో భాగంగానే చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ, అవసరమైన చోట పోస్టుల అప్‌గ్రేడేషన్ మరియు కేడర్ సమానత్వం కోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. పాలనలో మరింత వేగం పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags
AP IAS Promotions Andhra Pradesh IAS Officers Gandham Chandrudu Amrapali Kata
Recent Comments
Leave a Comment

Related News