నేటి ఆధునిక కాలంలో నగరాల్లో సహజీవనం, ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణం అయిపోయాయి. కానీ, ఒక గ్రామం మాత్రం ఈ నగర నాగరికత తమ ఊరికి సోకకూడదని భీష్మించుకుంది. అక్కడ రూల్స్ ఎంత కఠినంగా ఉన్నాయంటే.. పెళ్లయిన పది నెలల లోపు బిడ్డ పుడితే దాదాపు రూ. 40 వేలు జరిమానా కట్టాల్సిందే. చైనాలోని యునాన్ ప్రాంతం, లిన్‌కాంగ్ జిల్లాలోని ఒక గ్రామంలో ఈ వింత నిబంధనలు వెలుగులోకి వచ్చాయి.
గ్రామంలో నైతిక విలువలను కాపాడాలనే నెపంతో గ్రామ పెద్దలంతా కలిసి ఒక వింత తీర్మానం చేశారు. ఈ మేరకు ఊరి మధ్యలో ఒక భారీ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఆ బోర్డుపై ఉన్న నిబంధనలు చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. పెళ్లయిన 10 నెలల లోపే బిడ్డకు జన్మనిస్తే సదరు దంపతులు 3,000 యువాన్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 38,472 ఫైన్ చెల్లించాలి. ఒకవేళ పెళ్లి కాకుండా గర్భం దాల్చినా అంతే మొత్తం ఫైన్ కట్టాలని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.
అలాగే పెళ్లి కాకుండా కలిసి ఉంటే(సహజీవనం) ఏటా 500 యువాన్లు (సుమారు రూ. 6,000) జరిమానా కట్టాలి. ప్రేమ పెళ్లిళ్లపై కూడా సదరు గ్రాహం ఆంక్షలు విధించింది. వేరే ప్రాంతం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే 1,500 యువాన్లు (సుమారు రూ. 19,000) చెల్లించాల్సి ఉంటుంది. దంపతులు గొడవపడి పంచాయితీ గ్రామ పెద్దల వద్దకు వస్తే, తప్పు ఎవరిదైనా సరే ఇద్దరూ చెరో 500 యువాన్లు ఫైన్ కట్టాలి.
అంతేకాదండోయ్.. మద్యం సేవించి గొడవ చేస్తే రూ. 64 వేల వరకు, పుకార్లు సృష్టిస్తే రూ. 12 వేల వరకు జరిమానాలు విధిస్తామని ఆ బోర్డులో స్పష్టం చేశారు. ఈ వింత చట్టాలకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర చర్చకు దారితీసింది. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని విమర్శలు రావడంతో, అధికారులు వెంటనే స్పందించి ఆ బోర్డును అక్కడి నుంచి తొలగించారు.