ఏపీ మాజీ సీఎం జగన్ పై ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాం ప్రసాద్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కుట్ర, జగన్ కలిపితే వైసీపీ అని విమర్శించారు. జగన్ అండ్ కో కు ప్రతి దాంట్లో కుట్రను క్రియేట్ చేయడం అలవాటని దుయ్యబట్టారు. తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ నాయకత్వంలో కుట్రలకు వ్యూహం రచన జరుగుతుందని ఆరోపించారు. పట్టపగలే దొంగతనం చేయగలిగినంత సమర్థతగలిగిన పార్టీ వైసీపీ అని ఎద్దేవా చేశారు. నెయ్యిలో కల్తీ జరుగుతోందని, లడ్డూ తయారీలో కల్తీ జరుగుతోందని 2023లోనే తాను చెప్పానని గుర్తు చేస్తున్నారు.
జగన్ ప్రభుత్వంలోని వ్యవస్థలన్నింటిని నాశనం చేశారని, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా వదల్లేదని మండిపడ్డారు. తిరుపతి లడ్డూలో నాణ్యత లేదని, సరైన నెయ్యి వాడడం లేదని, సరైన పదార్థాలు లడ్డూలో ఉండటం లేదని ఇదే వేదికపై సమావేశం ఏర్పాటు చేసి చెప్పామని బుచ్చి రాంప్రసాద్ గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ విచారణకు ఆదేశించామని చెప్పారు. ప్రస్తుతం ఆ వ్యవహారం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని అన్నారు.