నెబ్రాస్కా తెలుగు సమితి (TSN) మొదటిసారిగా యూత్ కాన్ఫరెన్స్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఒమాహా ప్రాంతంలోని ఇండియన్ అమెరికన్ విద్యార్థులకు ప్రేరణ, వృత్తి మార్గదర్శకత్వం మరియు సాంస్కృతిక అనుసంధానం కల్పించే లక్ష్యంతో ఈ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చింది.
7వ తరగతి నుంచి కాలేజీ విద్యార్థుల కోసం రూపొందించిన ఈ సదస్సుకు ఎన్నార్టీల నుంచి అపూర్వ స్పందన లభించింది. తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు. తెలుగు సమాజంలోని యువ నిపుణులు నిర్వహించిన ఈ కార్యక్రమం తరువాతి తరం సాధికారత పొందడానికి కొత్త అధ్యాయంగా నిలిచింది.
ఆకాంక్ష మరియు గుర్తింపు మధ్య వారధి
విద్యార్థులకు విద్య మరియు వృత్తి మార్గాలపై స్పష్టమైన మార్గదర్శకత్వం అందించడం, ఇండో అమెరికన్ గుర్తింపులో బలంగా నిలిచి ఉండేలా చూడడం అనే 2 లక్ష్యాలతో ఈ కార్యక్రమం రూపొందించారు. వృత్తి మార్గదర్శకత్వం, నాయకత్వ అభివృద్ధి, సాంస్కృతిక గర్వం మరియు సమాజ విలువలపై సమానంగా దృష్టి సారించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. సమాజంతో అనుసంధానం కావడం యొక్క ప్రాముఖ్యతను TSN అధ్యక్షులు కొల్లి ప్రసాద్ వివరించారు. సమాజంతో అనుసంధానంగా ఉండాలని, మూలాలను మరిచిపోకూడదని, అప్పుడు మీరు ఎన్నటికీ ఒంటరి కారని ఆయన చెప్పారు.
విశిష్ట వక్తలు చూపిన మార్గం:
ఈ సదస్సులోని వక్తలు తమ అనుభవాలను పంచుకున్నారు. వైద్యం మరియు పరిశోధనలో వృత్తి మార్గాలను ఎంచుకోవడంపై తన అభిప్రాయాలను యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా మెడికల్ సెంటర్‌లో అనెస్థీషియాలజీ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గురుదత్త పెండ్యాల వెల్లడించారు. యూనియన్ పసిఫిక్‌లో లేబర్ రిలేషన్స్ మేనేజర్ అయిన రెబెక్కా పాటర్, నెబ్రాస్కా జపనీస్ యానిమేషన్ సొసైటీ స్థాపకురాలు మరియు చైర్‌పర్సన్ కూడా అయిన ఆమె, నాయకత్వం మరియు అంతర్-సాంస్కృతిక సమాజ నిర్మాణంపై మాట్లాడారు.
యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా ఆట్ ఒమాహాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ మరియు మార్కెటింగ్ & ఎంట్రప్రెన్యూర్‌షిప్ చైర్ అయిన డాక్టర్ ఫణి తేజ అడిదం స్థానంలో క్రాంతి అడిదం మాట్లాడారు. ఎంట్రప్రెన్యూర్‌షిప్ మరియు బిజినెస్ స్ట్రాటజీపై ఆయన ప్రసంగించారు. TSN వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేసిన క్రాంతి అడిదం తన అనుభవాలను పంచుకున్నారు. నాయకత్వం, వ్యక్తిగత అభివృద్ధి మరియు సమాజ భాగస్వామ్యంపై సందేశమిచ్చారు.
యువ నిపుణుల మాట:
వివిధ రంగాలకు చెందిన సాధికారిక నిపుణులతో జరిగిన డైనమిక్ ప్యానెల్ చర్చలో ఆది సేతుపతి (సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్), అపూర్వ కుంటే (లా), క్రాంతి సుధ (బిజినెస్), సుకర్ణ్ చొక్కర (మెడిసిన్), మరియు సాకేత్ మద్దిపాటి (ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ) తమ అనుభవాలను పంచుకున్నారు. వృత్తిపరంగా ఎదుర్కొన్న సవాళ్లు, అవి నేర్పిన పాఠాల గురించి ప్రసంగించారు.
ఈ సదస్సుకు అపూర్వ స్పందన:
ఒమాహాలోని భారతీయ సమాజం నుంచి ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చింది. తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా అవసరాలను పరిష్కరించడమే కాకుండా, వారు బలమైన సాంస్కృతిక అనుసంధానాన్ని కొనసాగించాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ఒమాహా భారతీయ సమాజం కృతజ్ఞతలు తెలిపింది. ఈ సదస్సులో పాల్గొన్న తల్లిదండ్రులకు, వారిచ్చిన మద్దతుకు, వారి పిల్లలను ప్రోత్సాహించినందుకు వారికి టీఎస్ఎన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది.
సమిష్టి ప్రయత్నం:
చాలామంది స్వచ్ఛంద సేవకుల అంకితభావం వల్ల ఈ సదస్సు విజయవంతమైంది. రిజిస్ట్రేషన్, లాజిస్టిక్స్, విద్యార్థుల సమన్వయం, సాంకేతిక మద్దతుకు టీఎస్ఎన్ ధన్యవాదాలు తెలిపింది. TSN యూత్ కమిటీ చైర్ క్రాంతి సుధ మరియు కో-చైర్ వివేక్ పోషాల నాయకత్వంలో ఈ కమిటీ పనిచేసింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో యూత్ కమిటీతోపాటు TSN ఎగ్జిక్యూటివ్ కమిటీ కీలకమైన మద్దతు అందించింది.
ఈ ఈవెంట్ స్పాన్సర్ శ్రీ కృష్ణ చైతన్య రావిపాటి, TSN ఎగ్జిక్యూటివ్ కమిటీకి, యూత్ కమిటీకి, స్వచ్ఛంద సేవకులకు ప్రత్యేక గుర్తింపు లభించింది.
మొదటి యూత్ కాన్ఫరెన్స్ నెబ్రాస్కాలోని తెలుగు సమాజంలో యువత భాగస్వామ్యానికి నాంది పలికింది. సమాజం యువతకు అవకాశాలిచ్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడింది. యువత విజయవంతం కావడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని అందించింది. యువత భవిష్యత్తులో నిర్వహించబోయే మరిన్ని కార్యక్రమాలకు ఈ కార్యక్రమం నాంది పలికిందని TSN అభిప్రాయపడింది.
భావితరపు ఇండో అమెరికన్ నాయకులను తయారు చేయడంలో ఈ కార్యక్రమం తొలి ప్రయత్నం అని తెలిపింది.
2025–2026 కాలానికి TSN యూత్ కమిటీలో చైర్ క్రాంతి సుధ, కో-చైర్ వివేక్ పోషాల, సెక్రటరీ వీణామాదురి ద్రోణదుల, ట్రెజరర్ కీర్తి సుధ, మరియు స్వచ్ఛంద సేవకులు ఆర్య యార్లగడ్డ, అరుష్ పుంతంబేకర్, సమన్వి కంటేం, మరియు మాన్స్వి పడాల ఉన్నారు.
వీడియోగ్రఫీ కోసం ప్రీతి బాసా మరియు జగదీష్ లకు టీఎస్ఎన్ ఆత్మీయ ధన్యవాదాలు తెలిపింది.