నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వింటేనే బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన ఊపు వస్తుంది. డైలాగ్స్ చెప్పినా, యాక్షన్ సీక్వెన్స్‌లలో మెరిసినా ఆయన శైలే వేరు. తాజాగా `అఖండ 2: తాండవం` చిత్రంతో బాలయ్య మరోసారి బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, వసూళ్ల సునామీలో మాత్రం ఎక్కడా తగ్గేదే లేదని నిరూపించారు. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటి, ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
ఐదు చిత్రాల అరుదైన పరంపర టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో బాలయ్య ఒక అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. వరుసగా ఐదు చిత్రాలతో (అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2) మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకున్న ఏకైక సీనియర్ హీరోగా ఆయన చరిత్ర సృష్టించారు. గతంలో వచ్చిన 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో కలిపి మొత్తం ఆరు చిత్రాలు ఈ క్లబ్‌లో ఉండటం విశేషం. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా, కేవలం తన మేనరిజం మరియు స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఓవర్సీస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల సత్తా ఆయనకు ఉందని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
ఒకప్పుడు బాలయ్య సినిమాలు అంటే కేవలం బి, సి సెంటర్లకే పరిమితం అనే టాక్ ఉండేది. కానీ, గత కొన్నేళ్లుగా ఆయన తన మార్కెట్‌ను సమూలంగా మార్చేశారు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా యూఎస్ ప్రేక్షకులను సైతం తన వైపు తిప్పుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ సక్సెస్ జోరు చూస్తుంటే, ఆయన తర్వాతి చిత్రాలు కూడా ఇదే స్థాయిలో రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ఎన్‌బీకే 111` చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమాతో బాలయ్య తన సొంత రికార్డులను తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.