తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. గత కొంతకాలంగా అసెంబ్లీకి దూరంగా ఉంటున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత సభలో అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కేవలం ప్రమాణ స్వీకారానికే పరిమితమైన ఆయన, ఇప్పుడు నేరుగా సభకు హాజరుకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే, ఈ పరిణామం ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. కేసీఆర్ అడుగులు ఇప్పుడు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిని ప్రశ్నించేలా చేస్తున్నాయి.
సభకు రాకుండా ఫామ్ హౌస్‌కే పరిమితమవుతున్నారన్న విమర్శలకు కేసీఆర్ తన రాకతో స్వస్తి పలికారు. రేవంత్ రెడ్డి సర్కార్‌ను శాసనసభ వేదికగా నిలదీయకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించిన గులాబీ బాస్, చివరకు వ్యూహం మార్చారు. ప్రజా సమస్యలపై పోరాడాలంటే చట్టసభలే సరైన వేదికని ఆయన గుర్తించడం పట్ల తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది.
ఇదే సమయంలో అందరి కళ్లు ఏపీ మాజీ సీఎం జగన్ వైపు మళ్లాయి. కేసీఆర్, జగన్ ఇద్దరూ అత్యంత సన్నిహితులు. గతంలో పాలనలోనూ, ఆధ్యాత్మిక కార్యక్రమాల విషయంలోనూ ఇద్దరూ ఒకే బాటలో నడిచేవారు. అసెంబ్లీ హాజరు విషయంలోనూ జగన్ కేసీఆర్‌ను ఫాలో అవుతారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఉంది. జగన్‌కు లేదు. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని, లేదంటే రానని జగన్ భీష్మించుకుని కూర్చున్నారు.
కానీ, అసలు హోదా లేని పరిస్థితుల్లో సభకు వెళ్లి గళమెత్తడం అసలైన నాయకత్వ లక్షణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేందుకు కేసీఆర్ ఎలాగైతే సిద్ధమయ్యారో, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి జగన్ కూడా అదే మార్గాన్ని ఎంచుకోవాలని ఆయన అభిమానులు సైతం కోరుకుంటున్నారు. మరి మిత్రుడు కేసీఆర్ బాటలోనే జగన్ కూడా అసెంబ్లీకి హాజరవుతారా? లేక తన హోదా పంతానికే కట్టుబడి ఉండిపోతారా? అనేది చూడాలి.