టాలీవుడ్ మెగా వెడ్డింగ్స్‌లో అల్లు ఫ్యామిలీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు ఆ ఇంట్లో మరోసారి పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు, యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. ప్రియురాలు నయనికతో ఏడడుగులు వేయబోతున్నాడు. వీరి వెడ్డింగ్ డేట్ లాక్ అయింది. అయితే తన పెళ్లి డేట్ ను శిరీష్ ప్రకటించిన తీరు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అల్లు శిరీష్, తన పెళ్లి తేదీని కూడా అంతే ట్రెండీగా రివీల్ చేశారు. తన అన్న అల్లు అర్జున్ పిల్లలు.. అయాన్, అర్హలతో కలిసి ఒక క్యూట్ రీల్ చేశారు శిరీష్. ఈ వీడియోలో పిల్లలు "బాబాయ్ మీ పెళ్లి ఎప్పుడు?" అని అడగగా, తన స్టైల్‌లో మార్చి 6, 2026న వివాహం జరగబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. వెంటనే "సంగీత్ ఎప్పుడు?" అని అడగగా.. "మనం పక్కా సౌత్ ఇండియన్స్ కదా.. అలాంటివి చేయం" అంటూ శిరీష్ సరదాగా కౌంటర్ ఇవ్వడం వీడియోలో హైలెట్‌గా నిలిచింది.
ఇకపోతే ఈ పెళ్లి తేదీ వెనుక ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్ దాగి ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - స్నేహారెడ్డిల వివాహం 2011 మార్చి 6న జరిగింది. ఇప్పుడు సరిగ్గా 15 ఏళ్ల తర్వాత, అదే తేదీన అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనిక మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నారు. అన్న పెళ్లి జరిగిన రోజే తమ్ముడు కూడా పెళ్లి పీటలు ఎక్కుతుండటంతో అల్లు అభిమానులు, సినీ సెలబ్రిటీలు శిరీష్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మొత్తానికి 2026 మార్చి 6న అల్లు ఫ్యామిలీలో డబుల్ సెలబ్రేషన్స్ గ్యారెంటీ అని అర్థమవుతోంది!