2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీ రాజకీయాల్లో `11` అనే అంకెకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రికెట్ టీమ్ అంత మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వెళ్దామా వద్దా అనే సందిగ్ధంలో ఉన్న జగన్ గారి 2025 వైఖరిని చూస్తుంటే, ఆయన ఇంకా `నేను విన్నాను.. నేను ఉన్నాను` అనే మోడ్ లోనే ఉన్నారా లేక `మీరు వినలేదు.. నేను వెళ్ళను` అనే పంతంలో ఉన్నారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
అసెంబ్లీకి డుమ్మా: మైక్ ఇస్తేనే వస్తా.. లేదంటే ప్యాలెస్లో ఉంటా!
ప్రజా సమస్యల మీద పోరాడాల్సిన అసెంబ్లీకి వెళ్లడం కంటే, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా డిజిటల్ వార్ చేయడమే సేఫ్ అని జగన్ గారు ఫిక్స్ అయ్యారు. `నాకు మైక్ ఇవ్వరు.. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు.. అందుకే నేను రాను` అని ఆయన భీష్మించుకు కూర్చోవడం చూస్తుంటే, స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రాలేదని క్లాస్ ఎగ్గొట్టే మొండి పిల్లాడి రాజకీయం గుర్తొస్తోంది. చట్టసభకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ప్రభుత్వంపై విమర్శలు చేయడం జగన్ గారి సరికొత్త ట్రాక్ రికార్డ్.
క్యాడర్ కు బ్రహ్మ: కలలో గెలుపు.. వాస్తవంలో పలాయింపు!
బయట గ్రాఫ్ పడిపోతున్నా, సొంత క్యాడర్ కి మాత్రం జగన్ గారు ఒక అద్భుతమైన బ్రహ్మలా కనిపిస్తున్నారు. `2029లో మళ్ళీ మనమే వస్తాం.. ఈసారి 175కి 175 కొడతాం` అంటూ ఆయన ఇచ్చే భరోసాలు చూస్తుంటే, డిజాస్టర్ సినిమాకి కూడా ఆస్కార్ వస్తుందని నమ్మించే డైరెక్టర్లా ఉన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కేసులు, ఇబ్బందులతో సతమతమవుతుంటే, నాయకత్వం మాత్రం జూమ్ మీటింగ్లకే పరిమితం కావడం విశేషం. క్యాడర్ కు ఆశలు కల్పించడంలో జగన్ గారు నిజంగానే బ్రహ్మదేవుడు.
పులివెందుల పులి.. ఇప్పుడు డిఫెన్స్ లో బిజీ!
ఒకప్పుడు `పులివెందుల నా అడ్డా` అని గర్జించిన మాటలు విన్నాం. కానీ 2025 ఉప ఎన్నికల ఫలితాలు, స్థానిక సంస్థల ఊపు చూస్తుంటే.. పులివెందుల కోట గోడలకి కూడా ఇప్పుడు సున్నం వేయడానికి పాత కాంట్రాక్టర్లు భయపడుతున్నారట. `ఎవడూ ఉండడు.. అంతా నేనే` అన్న జగన్ గారి సిద్ధాంతం ఇప్పుడు `అంతా వెళ్ళిపోయారు.. నేను ఒక్కడినే మిగిలాను` అన్నట్టుగా మారింది. 2025లో వైసీపీ నుంచి వలసలు జోరందుకున్నా, జగన్ గారు మాత్రం `వెళ్లేవాళ్ళు వెళ్ళిపోనివ్వండి.. నాతో ప్రజలు ఉన్నారు` అనే పాత డైలాగులతోనే సరిపెట్టుకుంటున్నారు. మరోవైపు సొంత చెల్లెలు షర్మిల గారు ఇచ్చే కౌంటర్లకి తట్టుకోలేక, పాపం జగన్ గారు `అన్నయ్య` అన్న సెంటిమెంట్ కూడా వాడలేకపోతున్నారు.
బటన్ నొక్కడం వర్కవుట్ అవ్వలేదేంటబ్బా?
ఐదేళ్లుగా బటన్ నొక్కాను అని ఊదరగొట్టిన జగన్ గారికి, ప్రజలు ఈసారి ఎగ్జిట్ బటన్ గట్టిగా నొక్కారని ఇంకా అర్థమైనట్టు లేదు. అయినా సరే, ఆయన వైఖరిలో మార్పు రాలేదు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల్లో లోపాలు వెతకడం కంటే, తాను ఎందుకు ఓడిపోయాననే విషయాన్ని విస్మరించడమే ఆయన 2025 మేజర్ హైలైట్. అయితే జగన్ గారికి ఇంకా ఒక నమ్మకం ఉంది. కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తుంది, జనం మళ్ళీ ఫ్యాన్ కిందకి వస్తారని. కానీ 2025లో పవన కళ్యాణ్ గారి స్పీడ్, చంద్రబాబు గారి వ్యూహాల మధ్య జగన్ స్కెచ్ లు గీతల్లాగే మిగిలిపోతున్నాయి.
మొత్తంగా 2025లో జగన్ వైఖరిని ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఓటమిని ఒప్పుకోరు.. గెలుపుకి దారి వెతుక్కోరు. ఆయన ఇంకా తన పాత గ్రాఫ్ లోనే ఊగుతున్నారు. కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడానికి చేసే ప్రయత్నాలు, సొంత పార్టీ క్యాడర్ లో కూడా నవ్వు పుట్టిస్తున్నాయి.