సినిమా పైరసీ ప్రపంచంలో ‘ఐబొమ్మ’ అంటే తెలియని వారుండరు. కానీ, ఆ సైట్ వెనుక ఉన్న అసలు సూత్రధారి రవి వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు జరుపుతున్న లోతైన విచారణలో ఒక్కో షాకింగ్ నిజం బయటపడుతోంది. కేవలం మూడు సంవత్సరాల్లోనే రవి సంపాదించిన మొత్తం అక్షరాలా రూ. 13 కోట్లు! కానీ, ఆ సంపాదన కంటే అతను ఆ డబ్బును ఖర్చు చేసిన విధానం చూసి సామాన్యులే కాదు, పోలీసు అధికారులు కూడా నోరెళ్లబెడుతున్నారు.
ఖర్చులో ‘నవాబు’.. రూ. 10 కోట్లు హాంఫట్..
సంపాదించిన రూ. 13 కోట్లలో దాదాపు రూ. 10 కోట్లను రవి కేవలం తన విలాసవంతమైన జీవనశైలి కోసమే ఖర్చు చేయడం గమనార్హం. అంటే లెక్క కడితే.. నెలకు సగటున సుమారు రూ. 27 లక్షలకు పైగా కేవలం జల్సాలకే తగలేశాడు. ఈ లెక్కన రవి రోజువారీ ఖర్చు సుమారు రూ. 90,000. ఖరీదైన పబ్‌లు, హైదరాబాద్‌లోని ఫైవ్ స్టార్ హోటళ్లు, లగ్జరీ కార్లు, విదేశీ ప్రయాణాలే లక్ష్యంగా రవి హైఫై లైఫ్ గడిపినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం అతని బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ. 3 కోట్లను అధికారులు సీజ్ చేశారు.
ఇకపోతే రవికి పైరసీపై ఆసక్తి నిన్న మొన్నటిది కాదు.. 2007 నుంచే అతను ఈ అక్రమ మార్గంలో పాగా వేశాడు. ఇందుకోసం తన స్నేహితులనే నమ్మించి గొంతు కోశాడు. తన స్నేహితులైన ప్రహ్లాద్, అంజయ్య, కాళీ ప్రసాద్ వంటి వారి ఆధార్, పాన్ కార్డులను వారి ప్రమేయం లేకుండానే దొంగిలించాడు. వాటిపై తన ఫోటోను అతికించి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించాడు. ముఖ్యంగా ప్రహ్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ నుంచి బ్యాంక్ అకౌంట్ల వరకు అన్నీ తన ఆధీనంలోకి తీసుకున్నాడు.
మరోవైపు అక్రమంగా వస్తున్న ఆదాయాన్ని వైట్ మనీగా మార్చుకునేందుకు రవి ఏకంగా మూడు కంపెనీలను స్థాపించాడు. `Supplier India`, `Hospital Inn`, `ER Infotech`.. ఈ సంస్థల ముసుగులో పైరసీ ఆదాయాన్ని చట్టబద్ధమైన వ్యాపార ఆదాయంగా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో రామగుండానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అంజయ్య పరారీలో ఉండగా, ప్రత్యేక బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి. మొత్తానికి ఒకవైపు సినీ ఇండస్ట్రీని పైరసీ భూతం పీడిస్తుంటే, మరోవైపు ఆ పైరసీ సొమ్ముతో రవి లాంటి వాళ్లు కోట్లతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.