``దైవం మానుష రూపేణ`` అని పెద్దలు అంటారు. అంటే మనిషిలోనే దేవుడున్నాడని అర్థం. కానీ నేడు దేవుడు కేవలం ``ధనవంతుల రూపేణ`` లేదా ``అధికార రూపేణ`` మాత్రమే దర్శనమిస్తున్నాడా? అన్న సందేహం కలగక మానదు. దేవాలయం.. అశాంతిని వదిలేసి ప్రశాంతతను వెతుక్కునే చోటు. అహంకారాన్ని విడిచి పెట్టి ఆ పరమాత్మ ముందు మోకరిల్లే వేదిక. ధనికుడు, పేదవాడు, అధికారి, సామాన్యుడు.. ఈ తేడాలన్నీ గడప బయటే వదిలేయాలన్నదే హైందవ ధర్మం. దురదృష్టవశాత్తు నేడు దేవాలయాలే అసమానతలకు అడ్డాగా మారుతున్నాయి. గుడి లోపల దేవుడు అందరివాడు.. కానీ గుడి బయట క్యూ లైన్లే అసలు తేడాని చూపిస్తున్నాయి.
భక్తిలో కూడా బ్రాండింగ్ అవసరమా?
నిన్న ముక్కోటి ఏకాదశి. వైకుంఠ ద్వారం గుండా ఆ స్వామిని చూస్తే జన్మ ధన్యమవుతుందని వేలాది మంది భక్తులు గంటల తరబడి చలిలో, ఆకలిని భరిస్తూ వేచి చూశారు. కానీ, అక్కడ జరిగింది ఏమిటి? వేలాది మందిని పక్కకు నెట్టేస్తూ, క్యూ లైన్లను స్తంభింపజేస్తూ వీఐపీలు రాజసం ఉట్టిపడేలా లోపలికి వెళ్లారు. అంటే ఆ వీఐపీ ఇచ్చే డొనేషన్ కి ఉన్న విలువ, సామాన్యుడు తన చెమటను ధారపోసి హుండీలో వేసే పది రూపాయల నాణేనికి లేదా అతడి నిష్కల్మషమైన భక్తికి లేదా? అన్నదే ప్రశ్న.
ఒకప్పుడు పాలనలో అత్యంత కీలకమైన వ్యక్తులు, అత్యవసర పనుల్లో ఉండేవారికి ప్రత్యేక దర్శనం కల్పించేవారు. కానీ నేడు, చిన్న గ్రామాల్లోని గుడి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు ప్రతిచోటా వీఐపీ సంస్కృతి ఒక వైరస్ లా పాకిపోయింది. డొనేషన్ ఇస్తే ఒక రకమైన దర్శనం. పలుకుబడి ఉంటే మరో రకమైన దర్శనం. ఇవేమీ లేని సామాన్యుడికి మాత్రం `గోవిందా` అంటూ గంటల తరబడి నిరీక్షణ. పాలనలో బిజీగా ఉండేవారికి సరే.. కానీ పేరు తెలియని వీఐపీల సంగతేంటి? కేవలం పలుకుబడి ఉందనో, రికమెండేషన్ ఉందనో సామాన్యులను ఇబ్బంది పెట్టడం ధర్మమేనా? రాజ్యాంగం ముందు అందరూ సమానమే అని చెప్పుకునే మనం, దేవుడి ముందు మాత్రం ఎందుకు అంతరాలు సృష్టిస్తున్నాం? వీఐపీల కోసం గంటల తరబడి దర్శనాలు నిలిపివేయడం అంటే.. భగవంతుడిని సామాన్యుడికి దూరం చేయడమే కదా.
సహనం, సమయం విలువ తెలుసుకోవడానికి దేవాలయం ఒక మంచి వేదిక. కానీ ఆ వేదిక నేడు అసమానతలకు నిలయంగా మారుతోంది. నిజమైన భక్తుడు ఎప్పుడూ క్యూలో నిలబడటానికి వెనుకాడడు. ఎందుకంటే ఆ నిరీక్షణలో ఉండే తపనే దైవత్వాన్ని ఇస్తుంది. దేవుడు అందరివాడు అయినప్పుడు, దర్శనం కూడా అందరికీ సమానంగా అందాలి.